మా నాన్న హత్య జరగాలనే.. భద్రత తొలగించారు!
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:08 AM
దివంగత ప్రధాని, తన తండ్రి రాజీవ్‌గాంధీ హత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ హత్యకు గురి కావటానికి వీలుగా కావాలనే ఆయనకున్న భద్రతను అప్పట్లో తొలగించారని పేర్కొన్నారు.
రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణ
1991లో శ్రీపెరంబుదూర్‌కు ముందు బిహార్‌లో రాజీవ్ పర్యటన.. విదేశాల నుంచి వచ్చిన రాహుల్ తండ్రి వెంట
రాజీవ్‌పై రాళ్లు.. తండ్రి భద్రతపై రాహుల్ ఆందోళన
నాన్నకు సెక్యూరిటీ కల్పించకపోతే.. మళ్లీ నేను ఆయన అంత్యక్రియలకే రావాల్సి వస్తుందంటూ తల్లితో ఆవేదన
ఆపై కొన్ని వారాలకే ఎల్‌టీటీఈ చేతిలో రాజీవ్ హత్య
1989లో ఎస్పీజీ భద్రతను తొలగించిన వీపీ సింగ్ సర్కారు.. ఆపై చంద్రశేఖర్ ప్రభుత్వానిదీ అదే విధానం
న్యూఢిల్లీ, నవంబరు 24: దివంగత ప్రధాని, తన తండ్రి రాజీవ్‌గాంధీ హత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ హత్యకు గురి కావటానికి వీలుగా కావాలనే ఆయనకున్న భద్రతను అప్పట్లో తొలగించారని పేర్కొన్నారు. హత్య జరగటానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించారని చెప్పారు. తన తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంభాషణ తాలూకు వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోనియాగాంధీ తన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, వారి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. 1991 మే 21వ తేదీన రాజీవ్ హత్య జరగటానికి ముందున్న పరిస్థితుల గురించి వారు మాట్లాడుకున్నారు. ఆ నెల ప్రారంభంలో బిహార్ పర్యటనకు రాజీవ్‌గాంధీ వెళ్లగా.. విదేశాల్లో చదువుకుంటున్న రాహుల్ అప్పుడే స్వదేశానికి వచ్చి తండ్రి వెంట బిహార్‌కు వెళ్లిన సంగతిని సోనియా గుర్తు చేశారు. ‘అప్పట్లో రాజీవ్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. బీజేపీగానీ, మరో ప్రత్యర్థి పార్టీగానీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాజీవ్ భద్రతను పట్టించుకునేవి కావు. బిహార్‌లోనూ అదే జరిగింది. పర్యటనలో భాగంగా ఒపెన్‌టాప్ జీప్‌లో వెళ్తున్నప్పుడు రాజీవ్‌పైకి ప్రత్యర్థి పార్టీల వాళ్లు రాళ్లు విసిరారు.
ఆయనకు వ్యతిరేకంగా అరుపులు, కేకలతో బీభత్సం సృష్టించారు. ఇదంతా దగ్గరుండి చూసిన రాహుల్.. ఆ పర్యటన నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాతో మాట్లాడాడు. అమ్మా! నాన్న భద్రత గురించి మనం ఏమైనా చేయకపోతే, నేను మళ్లీ వచ్చేది ఆయన అంత్యక్రియలకేనని అనిపిస్తోంది అని ఆందోళన వ్యక్తం చేశాడు’ అని సోనియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘బిహార్ పర్యటన అనేది తుది అంకం. కానీ, నేను దానికి ముందు నుంచీ చెబుతూనే ఉన్నా. నాకు స్పష్టత ఉంది. నాన్న భద్రతను కావాలని తొలగించారు. ఆయన హత్య జరగటానికి వీలుగానే ఇది జరిగింది. దీనిపై (భద్రత తొలగింపుపై) నాన్నతో, అమ్మతో పలుమార్లు మాట్లాడాను. నాన్నతోనైతే ఓసారి ఏకంగా వాగ్వాదం కూడా జరిగింది’ అని చెప్పారు. ప్రియాంక మాట్లాడుతూ.. ‘నానమ్మ (ఇందిరాగాంధీ) హత్య తర్వాత నాన్న భద్రత గురించి అమ్మ విపరీతంగా ఆందోళన చెందేవారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది సరిగానే ఉన్నారా? నిద్ర పోతున్నారా? అని తరచూ తనిఖీ చేసేవారు. ఇంటి చుట్టూ భద్రత కోసం ఏర్పాటు చేసిన ముళ్లతీగ కంచెను పరిశీలించేవారు. నా గది ఇంటి ముందుభాగంలో ఉండేది. దీనివల్ల ఇదంతా నేను గమనిస్తూ ఉండేదాన్ని. నాన్న ఇంట్లోకి వచ్చినట్లుగా ఆయన అడుగుల చప్పుడు వినిపించిన తర్వాతే నేను పడుకునేదాన్ని’ అని గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి భద్రత గురించి రాహుల్ హేతుబద్ధంగా ఆలోచిస్తే, తాను మాత్రం భావోద్వేగపూరితంగా స్పందించేదాన్నని ప్రియాంక తెలిపారు.
11 ఏళ్ల వ్యవధిలో సంజయ్, ఇందిర, రాజీవ్ మృతి
రాహుల్ ఊహించినట్లుగానే.. అదే నెలలో 21వ తేదీన రాజీవ్‌గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఓ ఎల్‌టీటీఈ ఉగ్రవాది చేతుల్లో దారుణ హత్య కు గురయ్యారు. తండ్రి అంత్యక్రియలకు హాజరు కావటానికి రాహుల్ విదేశాల నుంచి వచ్చారు. కాగా, ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్‌కు కొన్నేళ్లపాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత కొనసాగింది. ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆయన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించేవారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజీవ్ సంచరించటాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేసేవారు. ప్రజలతో సంబంధాన్ని కోల్పోయారంటూ వ్యాఖ్యానించేవారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. వీపీ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటైంది. రాజీవ్‌కున్న ఎస్పీజీ భద్రతను కేంద్రప్రభుత్వం తొలగించింది. 1990 చివరలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు. వాస్తవానికి 1988 నాటి ఎస్పీజీ చట్టం ప్రకారం ప్రధానికి, ప్రధాని కుటుంబసభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుంది. రాజీవ్ హత్య తర్వాత ఈ చట్టాన్ని సవరించి మాజీ ప్రధానులకూ వారి ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని బట్టి ఎస్పీ జీ భద్రతను కల్పించటం ప్రారంభించారు. అయితే, రాజీవ్‌కు ఉన్న ముప్పు దృష్ట్యా ఆయనకు చట్టం నుం చి ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చి ఉండాల్సిందన్న అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. హత్యకు కేవలం కొన్ని వారాల ముందు జరిగిన బిహార్ పర్యటనలో టైమ్ మ్యాగజైన్ విలేకరితో తన భద్రత గురించి రాజీవ్ మాట్లాడారు. ‘నాకు ముప్పు పొంచి ఉందన్న సంగతి తెలుసు.
కానీ నాముందు మరో దారి లేదు. అయితే, ప్రజల్లో ఉండాలి లేదంటే నా భద్రతను చూసుకుంటూ వారికి దూరంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. ఆయన అన్నట్లుగానే బిహార్ తర్వాత జరిగిన తమిళనాడు పర్యటనలో ప్రజల నుంచి స్వయంగా పూలదండలు అందుకుంటూ, వినతిపత్రాలు స్వీకరిస్తున్న క్రమంలో ఎల్‌టీటీఈ మానవబాంబు చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు మాత్రమే. నాటికి కేవలం ఆరున్నరేళ్ల క్రితం (1984లో) ఆయన తల్లి, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సొంత అంగరక్షకుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. విచిత్రమేమిటంటే, ఇందిర తన రాజకీయ వారసుడిగా భావించిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ 1980లో హెలికాప్టర్ నడుపుతూ అది కూలిపోయి మరణించారు. ముగ్గురివీ దారుణమైన మరణాలే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో అత్యంత శక్తిమంతమైన కుటుంబానికి చెందిన తల్లి, ఆమె కొడుకులిద్దరూ 11 ఏళ్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు అకాల మరణానికి గురి కాకపోయినా, దేశ రాజకీయాల పరిణామక్రమమే వేరే విధంగా ఉండేదని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు.