Share News

పోలీస్‌ స్టేషన్‌లో రాహుల్‌ ధర్నా

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:58 AM

గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్‌ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు.

పోలీస్‌ స్టేషన్‌లో రాహుల్‌ ధర్నా

  • పెల్లెట్‌గన్‌ దాడిలో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన

  • ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని డిమాండ్‌

  • అంగీకరించని ఢిల్లీ పోలీసులు

  • ఆరు గంటలపాటు ధర్నా చేసిన రాహుల్‌

  • ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్‌ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్‌ లోచబ్‌, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు నమోదు చేయకపోవటంతో ఆ విషయాన్ని వారు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి రాహుల్‌ శుక్రవారం.. మందిర్‌మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. పెల్లెట్‌గన్‌ దాడిలో లోచబ్‌ కంటికి మూడు పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదం అని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించటంతో రాహుల్‌ తదితరులు పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్‌శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అంగీకరించకపోవటంతో.. రాహుల్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్‌ విలేకరులకు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేవరకూ కదిలేది లేదని, అవసరమైతే ఆరు నెలలపాటైనా ధర్నాలోనే కూర్చుంటానని ప్రకటించారు. లోచబ్‌ కంట్లో మూడు పెల్లెట్లు పడ్డాయని ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆస్పత్రి ఇచ్చిన నివేదికను ప్రదర్శించారు. లోచబ్‌ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని లోహపు పెల్లెట్లను చూపించారు.


హక్కులను కాలరాస్తున్నారు

ధర్నా కొనసాగుతున్న సమయంలోనే ఎక్స్‌లో రాహుల్‌ ఇదే అంశంపై ఒక పోస్ట్‌ పెట్టారు. ‘జూలై 20వ తేదీన జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోచబ్‌పై పెల్లెట్‌గన్‌తో దాడి చేశారు. తనకు న్యాయం కావాలని కోరుతూ లోచబ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమంటే నిరాకరిస్తున్నారు. న్యాయం అంటే అమిత్‌షాకు ఎందుకు అంత భయం? ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరపాల్సిందే. విద్యార్థుల మీద జరిగిన దారుణాలకు పైనుంచి కింది వరకు ఏ స్థాయిలో ఉన్న వారికైనా శిక్షలు పడాల్సిందే. ప్రతీ విద్యార్థికీ నేను అండగా ఉంటా’ అని పేర్కొన్నారు. ప్రియాంకాగాంధీ తదితర కాంగ్రెస్‌ నేతలు కూడా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఏకంగా ఆరు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరికి పోలీసులు దిగి వచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో రాహుల్‌గాంధీ ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇది న్యాయం దిశగా పడిన తొలి అడుగు మాత్రమేనన్నారు. కొన్ని గంటలపాటు నిరసన జరిపితేగానీ పెల్లెట్‌గన్‌ బాధితుడి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదంటే, దేశంలో న్యాయం కోసం వెళ్లే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హోంశాఖ కార్యదర్శి, అమిత్‌షా నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని, అంటే, ఇప్పటి వరకూ వారిని ఆపుతున్నదెవరో అర్థం చేసుకోవాలన్నారు.


చవకబారు రాజకీయం: జేపీ నడ్డా

రాహుల్‌ ధర్నాపై బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ఇది విద్యార్థుల కోసం జరిగింది కాదని, మీడియా కవరేజీ కోసమే నిర్వహించారని ఆరోపించారు. ‘చలో పార్లమెంటు’ ర్యాలీ హింసాకాండ మీద సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలా ధర్నాలకు దిగటం ఏమిటన్నారు. ఇదంతా చవకబారు, అరాచక రాజకీయమని విమర్శించారు. ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ఓ పోలీసు అధికారి వెల్లడించారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 118 (ప్రమాదకరమైన ఆయుధంతో కావాలనే గాయపర్చటం), సెక్షన్‌ 25 (ఇతరుల ప్రాణాలకు, భద్రతకు హాని కలిగించటం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 06:00 AM