అమెరికా ఒప్పందంపై దేశవ్యాప్త ఉద్యమం!
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:35 AM
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం పార్లమెంటు భవన సముదాయంలో జరిగిన...
రైతు సంఘాలతో రాహుల్ భేటీ.. అన్నదాతలు, రైతు కూలీల జీవనోపాధిపై చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం పార్లమెంటు భవన సముదాయంలో జరిగిన ఈ భేటీలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ ఒప్పందాన్ని రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, పప్పు ధాన్యాల రైతుల బతుకుదెరువు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఒప్పందంతో దేశంలోకి వ్యవసాయ దిగుమతులకు తలుపులు తెరుచుకుంటాయని.. ఇతర పంటలు కూడా భారత్‌లోకి ప్రవేశిస్తాయని రాహుల్ వారికి చెప్పారని కాంగ్రెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన్ను కలిసిన రైతు సంఘాల నేతల్లో సుఖ్‌పాల్ ఎస్.ఖైరా (ఆలిండియా కిసాన్ కాంగ్రెస్), అశోక్ బల్హారా (భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్, హరియాణా), బల్దేవ్ ఎస్.జీరా (బీకేయూ క్రాంతికారి), ఆర్.నందకుమార్ (ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఫ్రంట్), అమర్‌జిత్ మోహ్రీ (బీకేయూ షహీద్ భగత్‌సింగ్), గురంనీత్ ఎస్.మంగత్ (కిసాన్ మజ్దూర్ మోర్చా-ఇండియా), హమీద్ మాలిక్ (జేకే జమీదారా ఫోరమ్) తదితరులు ఉన్నారని తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రధాని మోదీ దేశాన్ని అమ్మేస్తున్నారని రాహుల్ ‘ఎక్స్’లో విమర్శించారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినా.. సభాహక్కుల తీర్మానం తెచ్చినా.. తాను రైతుల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. ఒప్పందానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వంపై తాను చేసిన విమర్శల వీడియోను ఈ సందర్భంగా పోస్టు చేశారు. ‘రైతుల జీవనోపాధిని దెబ్బతీసి.. దేశ ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ఏ ఒప్పందమైనా రైతు వ్యతిరేకమే. అన్నదాతల ప్రయోజనాలపై మోదీ సర్కారు రాజీపడేందుకు అనుమతించం’ అని తేల్చిచెప్పారు.