Share News

గ్యాస్‌కు, ఎప్‌స్టీన్‌కు లింకు

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:49 AM

దేశంలో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్‌ కొరతకు, ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి పేరు ఉండడానికి సంబంధం ఉందంటూ విపక్షనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో గురువారం చేసిన ఆరోపణ కలకలం సృష్టించింది.

గ్యాస్‌కు, ఎప్‌స్టీన్‌కు లింకు

  • మన ఆయిల్‌ కొనుగోలును ఇతరులు నిర్ణయించడం ఏమిటి?

  • ఆ ప్రశ్నకు సమాధానంగా దొరికిన లంకె

  • పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు

  • లోక్‌సభలో రాహుల్‌ ఆరోపణ

న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్‌ కొరతకు, ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి పేరు ఉండడానికి సంబంధం ఉందంటూ విపక్షనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో గురువారం చేసిన ఆరోపణ కలకలం సృష్టించింది. మంత్రికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు, అనుకూలంగా అధికార పక్ష సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితిని గమనించిన స్పీకర్‌ ఓం బిర్లా.. నోటీసు ఇవ్వకుండా సంబంధం లేని విషయాలను మాట్లాడుతున్నారంటూ రాహుల్‌ మైక్‌ను కట్‌ చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన వంట గ్యాస్‌ కొరతపై రాహుల్‌ ప్రసంగించారు. ఇంధన భద్రతపై ప్రభుత్వం రాజీ పడినందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. దేశ ఇంధన అవసరాలపై అమెరికా ఆంక్షలు విధించే స్థితికి తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ‘‘ప్రతి దేశ పునాదులు ఇంధన భద్రతపైనే ఆధారపడి ఉన్నాయి. మనం ఆయిల్‌ను ఎవరి నుంచి కొనుగోలు చేయాలి, గ్యాస్‌ను ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న నిర్ణయాలను అమెరికాకు విడిచిపెట్టాం. రష్యా నుంచి ఆయిల్‌ కొనాలా, వద్దా? ఇతర సరఫరాదార్లతో సంబంధాలు ఎలా ఉండాలన్నదాన్ని మనమే నిర్ణయించుకోవాలి. కానీ అలా జరగడం లేదు’’ అని విమర్శించారు. ఇదే సమయంలో ఓ చిక్కు ప్రశ్న తనను ఎంతో కాలంగా తనను వేధిస్తోందని రాహుల్‌ అన్నారు. ‘‘భారత్‌లాంటి పెద్ద దేశం రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడానికి వేరే దేశం అధ్యక్షుడి అనుమతి తీసుకోవాల్సి రావడం ఏమిటన్న పజిల్‌ తొలిచేస్తోంది. దానికి సమాఽధానాన్ని వెతికాను. ‘రాజీపడిపోవడమే’ ఇందుకు కారణమని తేలింది’’ అని చెప్పారు. ఆ రాజీకి గల కారణాలను వివరిస్తూ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురివైపు చూశారు. ‘ఇక్కడొక జంటిల్మన్‌ కూర్చొన్నారు. ఆయన ఇంధన శాఖ మంత్రి. ఎప్‌స్టీన్‌ ఆయన మిత్రుడని స్వయంగా అంగీకరించారు’ అని తెలిపారు. ఎప్‌స్టీన్‌ ప్రస్తావన రావడంతో వెంటనే స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. వంట గ్యాస్‌ సరఫరాపై నోటీసు ఇచ్చినందున దానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. రాహుల్‌ సమాధానం ఇస్తూ దేశంలోని ఇంధన భద్రతపై మాట్లాడుతున్నానని చెప్పారు. ‘మంత్రి పురి కుమార్తె పారిశ్రామికవేత్త జార్జి సోరోస్‌ నుంచి నిధులు పొందారు. నా దగ్గర పత్రాలు ఉన్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అధికార పక్ష సభ్యులు నిరసన తెలిపారు. గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకొని నోటీసులో ఇచ్చిన అంశంపైనే ప్రసంగించాలని చెబుతూ రాహుల్‌ ప్రసంగాన్ని నిలిపివేయించారు. ఇందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. రాహుల్‌, ప్రియాంక తదితరులు సభ నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Mar 13 , 2026 | 03:49 AM