Share News

సుప్రీంకు మార్చ్‌!

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:15 AM

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ నిలిపివేత, బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికల..

సుప్రీంకు మార్చ్‌!

  • ‘ఓటు చోరీ’పై నేడు ఇండి కూటమి ఆందోళన

  • ‘చలో ఢిల్లీ - ప్రజాస్వామ్యం కోసం మార్చ్‌’ పేరిట

  • కనాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ

  • భారీగా తరలిరావాలని శ్రేణులకు కాంగ్రెస్‌ పిలుపు

  • వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళుతున్న కూటమి నేతలు

  • సీఎం రేవంత్‌, కర్ణాటక, కేరళం సీఎంలు కూడా..

  • సీజేఐని కలిసి వినతిపత్రం ఇస్తామన్న ఖర్గే, రాహుల్‌

  • కలిసేందుకు అనుమతివ్వని జస్టిస్‌ సూర్యకాంత్‌

  • యువత స్వరం మరింతగా ప్రతిధ్వనిస్తుంది: రాహుల్‌

  • దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది: ఖర్గే

  • ఢిల్లీలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు

న్యూఢిల్లీ/ బెంగళూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ నిలిపివేత, బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికల నిర్వహణ డిమాండ్లతో ఇండి కూటమి సోమవారం భారీ ర్యాలీకి సిద్ధమైంది. ‘చలో ఢిల్లీ - ప్రజాస్వామ్యం కోసం మార్చ్‌’ పేరిట ఢిల్లీలోని కనాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. చీఫ్‌ జస్టి్‌సకు వినతిపత్రం అందజేస్తామని ఇండి కూటమి నేతలు ప్రకటించారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతోపాటు భారీ సంఖ్యలో యువత ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే తనను కలిసి, వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్ష నేతలు చేసిన విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ తిరస్కరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఢిల్లీలో వేలాది మంది పోలీసు, పారామిలిటరీ బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఎక్కడా చిన్న నిరసన కూడా కనిపించకుండా బారికేడ్లు, ట్రాఫిక్‌ మళ్లింపులు, బలగాల తనిఖీలతో కట్టుదిట్టం చేస్తున్నారు.


ఆదివారం వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఇండి కూటమి ఆందోళనతో పరిస్థితి ఎలా మారుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఆదివారం కూడా ఢిల్లీలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. ఎక్కడ చిన్న నిరసన కూడా నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఊరేగింపుగా బయలు దేరిన వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్‌ ప్లేస్‌, జంతర్‌ మంతర్‌, మండీ హౌజ్‌, పటేల్‌ చౌక్‌, మధురా రోడ్‌, సుప్రీంకోర్టు ఆశ్రమం, లాజపత్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ తదితర 30 ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు. దీనితో అనేక చోట్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.


నేడు ‘ఇండి’ ర్యాలీ

సోమవారం ఇండి కూటమి ఢిల్లీలో నిరసన ప్రదర్శనను చేపట్టనుంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కనాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించి.. సీజేఐ సూర్యకాంత్‌కు వినతిపత్రం సమర్పించాలని కూటమి నేతలు నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, ముఖ్యంగా యువత ఈ ఆందోళనలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. తెలంగాణ, కర్ణాటక, కేరళం రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్‌, సతీశన్‌తోపాటు పెద్ద సంఖ్యలో నేతలు ఢిల్లీకి రానున్నారు. మొత్తం పార్టీ ఎంపీలంతా ఢిల్లీ చేరుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రె్‌సతోపాటు ఇతర మిత్రపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘‘సోమవారం పార్టీలకు, కులమతాలు, రాష్ట్రాలకు అతీతంగా భారతీయులుగా సుప్రీంకోర్టు వైపు పాదయాత్రగా సాగుతాం. యువత స్వరం ఇప్పుడు మరింత ప్రతిధ్వనిస్తుంది’’ అని రాహుల్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమల్లో ఉందని ఖర్గే విమర్శించారు.


ప్రతిపక్ష నేతలతో భేటీకి సీజేఐ నిరాకరణ!

సోమవారం తనను కలిసేందుకు సమయం కోరిన ప్రతిపక్ష నేతలు రాహుల్‌, ఖర్గేల విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ తిరస్కరించినట్టు సమాచారం. చీఫ్‌ జస్టిస్‌ తన నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతల అధికారిక ఈ-మెయిల్‌ చిరునామాలకు పంపారని, భేటీని నిరాకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తిరస్కరణకు కారణాలు వెల్లడించలేదు.

Updated Date - Oct 12 , 2026 | 04:18 AM