గణతంత్ర వేడుకల్లో రాహుల్‌కు మూడో వరుసలో సీటా?
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:09 AM
ఢిల్లీ కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవాల కవాతును వీక్షించేందుకు విపక్ష నేతలకు కేటాయించిన సీట్ల కేటాయింపుపై రగడ జరుగుతోంది.
ఇది ఆయన్ను అవమానించేందుకే: కాంగ్రెస్
న్యూఢిల్లీ, జనవరి 26: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవాల కవాతును వీక్షించేందుకు విపక్ష నేతలకు కేటాయించిన సీట్ల కేటాయింపుపై రగడ జరుగుతోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మూడో వరుసలో సీట్లు కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ అసహనాన్ని సూచిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుర్జేవాలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ కావాలనే రాహుల్ గాంధీని అవమానించిందంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికమ్ ఠాగోర్ ఆరోపించారు. 2014లో అద్వానీ లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేత కాకున్నా ముందు వరుసలో సీటు కేటాయించామంటూ ఆయన పాత ఫొటోను ఎక్స్‌లో జత చేశారు. అయితే ప్రొటోకాల్ వ్యవహారాలను రాష్ట్రపతి సచివాలయం నిర్ణయిస్తుందని బీజేపీ స్పష్టం చేసింది. ప్రొటోకాల్ ప్రకారం విపక్ష నేతలు ఏడో ర్యాంక్ కిందకు వస్తారని, కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని తెలిపింది.