Share News

జ్ఞానేశ్‌కుమార్‌.. రాజీనామా చెయ్‌

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:40 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌స’లో వచ్చిన వార్తాకథనం నేపథ్యంలో..

జ్ఞానేశ్‌కుమార్‌.. రాజీనామా చెయ్‌

  • మోదీ, అమిత్‌ షా, సీఈసీ జ్ఞానేశ్‌ దేశద్రోహులు: రాహుల్‌

  • దేశద్రోహులకు కచ్చితంగా శిక్ష పడుతుందని హెచ్చరిక

  • అప్రూవర్‌గా మారాలని జ్ఞానేశ్‌ కుమార్‌కు సూచన

  • సీఈసీపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధం!

  • 48 గంటల్లోగా జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలి

  • సీజేపీ అల్టిమేటం.. దేశవ్యాప్త ఉద్యమానికి రెడీ

  • ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌మంతర్‌ 2.0 తప్పదని హెచ్చరిక

  • జ్ఞానేశ్‌ ప్రజాస్వామ్యానికి పెనుముప్పు: అభిజీత్‌దీప్కే

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌స’లో వచ్చిన వార్తాకథనం నేపథ్యంలో.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై విపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు దేశంలో ఓట్ల వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్‌.. సీఈసీ జ్ఞానేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో అప్రూవర్‌గా మారిపోవాలని సీఈసీకి సూచించారు. ఆయన చేసింది దేశ వ్యతిరేక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికలూ రిగ్‌ అవుతున్నాయని.. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా బూటకమని మండిపడ్డారు. దేశానికి చేసిన నష్టానికిగాను మోదీ, షాలపై దర్యాప్తు జరుగుతుందని.. ప్రజాస్వామ్యం నాశనమవుతుంటే తాము మౌనంగా చూస్తూ కూర్చోబోమని, బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తులు దేశద్రోహులేనని దుయ్యబట్టారు. ‘‘గుర్తు పెట్టుకోండి. దేశ ద్రోహులకు కచ్చితంగా శిక్ష పడుతుంది’’ అని హెచ్చరించారు.

Untitled-2 copy.jpg


విలేకరుల సమావేశంలో రాహుల్‌.. ‘కుట్రదారులు’, ‘పావులు’ అనే పేర్లతో కొందరి ఫొటోలను తెరపై ప్రదర్శించారు. కుట్రదారులు అనే శీర్షిక కింద మోదీ, అమిత్‌ షా, గౌతమ్‌ అదానీ, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, ప్రధాని పీఎస్‌ పీకే మిశ్రా, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ చిత్రాలను ఉంచారు. వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారనే అర్థం వచ్చేలా.. ‘పావులు (పాన్స్‌)’ అనే శీర్షిక కింద కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర పధ్రాన్‌, ప్రముఖ పాత్రికేయుడు అర్ణబ్‌ గోస్వామి, యోగా గురు రాందేవ్‌ బాబా తదితరుల ఫొటోలను ప్రదర్శించారు. బీజేపీ మరో 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్‌ షా, ‘ఈసారి 400 సీట్లు’ అని మోదీ అంటున్న వీడియోలను కూడా చూపిన రాహుల్‌.. ప్రజాస్వామిక వాతావరణంలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడూ అలాంటి వ్యాఖ్యలు చేయరని విమర్శించారు. భారతదేశంలో.. ప్రజా వ్యతిరేకత అనే సహజమైన ప్రజాచైతన్యం ఉంటుందని, అది ఎవరినీ వదిలిపెట్టదని గుర్తుచేశారు. తానొక రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో తనకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ఇందిరాగాంధీ ఒకటిరెండేళ్లలోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారని ఆయన ఉదహరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయని.. కానీ నరేంద్రమోదీ, అమిత్‌ షా మాత్రం ప్రజావ్యతిరేకతను ఎందుకు ఎదుర్కొనడం లేదనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనందరికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు. ‘‘ప్రజా వ్యతిరేకత పూర్తిగా కనిపించకపోవడమా? ఇది సద్దాంహుస్సేన్‌ పాలనలోని ఇరాక్‌లో, ఉత్తర కొరియా వంటి చోట్ల మాత్రమే జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.


ఓటే పోతే..

ఓటే మన ప్రజాస్వామ్యానికి పునాది అని.. ఎన్నికల కమిషన్‌ సంరక్షించే ఓటు రాజ్యాంగాన్ని కాపాడుతుందని రాహుల్‌ పేర్కొన్నారు. ‘‘అంతటి కీలకమైన ఓటే ధ్వంసమైపోతే రాజ్యాంగం కూడా నాశనమైనట్టే. దానికి ఎలాంటి శక్తీ ఉండదు. రాజ్యాంగం ధ్వంసమైతే.. చట్టాలు అక్రమంగా, వ్యవస్థలు అర్థరహితంగా మారుతాయి’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఓటు చోరీ వల్ల చట్టాల చోరీ, వ్యవస్థల చోరీ జరుగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఓటు చోరీ కుట్రకు తెరతీసినవారెవరో దేశానికి తెలుసన్నారు. ఓట్ల చోరీ తర్వాత చేసిన చట్టాలన్నీ చెల్లనివేనన్నారు.

మూడోసారి..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి తొలగించేందుకు లోక్‌ సభ, రాజ్యసభల్లో వచ్చేవారం నోటీసులు సమర్పించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దీనితో ప్రతిపక్షాలు మూడోసారి సీఈసీ తొలగింపునకు నోటీసు ఇచ్చినట్లవుతుంది. ఇందుకోసం ఇండియా కూటమి పార్టీలన్నీ మరో సారి సమావేశం కానున్నాయి. జ్ఞానేశ్‌కుమార్‌ తొలగింపునకు 73 మంది విపక్ష ఎంపీలు ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ఇచ్చిన నోటీసు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.


  • 29న సీడబ్ల్యూసీ భేటీ

  • దేశవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ

ఓటు చోరీ, సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళిక రచించేందుకు ఈ నెల 29న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుందని పార్టీ వర్గా లు వెల్లడించాయి. దీనికి సంబంధించి.. పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ గురువారం ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జులు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించినట్లు తెలిపాయి. అలాగే.. 25న అన్ని రాష్ట్రాల్లో ఈసీ కార్యాలయాల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్రాల పార్టీ శాఖలను కోరినట్లు కేసీ వేణుగోపాల్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు. 28న కలెక్టరేట్ల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

మళ్లీ ఆందోళనకు దిగుతాం..

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే కూడా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అతి పెద్ద దేశద్రోహిగా, ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా అభివర్ణించారు. ఆయన మరో 48 గంటల్లోగా రాజీనామా చేయకపోతే తాము దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని.. జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ‘‘మా ఓటు హక్కును రద్దుచేయడానికి జ్ఞానేశ్‌ ఎవరు?’’ అని ప్రశ్నించి.. ఆయనపై క్రిమిన ల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ రాజీనామా చేయకపోతే ‘జంతర్‌మంతర్‌ 2.0’ కచ్చితంగా జరిగి తీ రుతుందని దీప్కే స్పష్టం చేశారు. ఇక.. దేశంలోని జెన్‌ జీ తమకు మద్దతుగా లేదని భావిస్తున్నందునే అధికార పార్టీ యువ ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలోంచి తీసేసే చర్యలు తీసుకుంటోందని సీజేపీ కో-కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ ఆరోపించారు.

Updated Date - Sep 25 , 2026 | 05:43 AM