సీపీఎం, బీజేపీ మధ్య ఒప్పందం
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:59 AM
కేరళలో సీపీఎం, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎల్‌డీఎఫ్ గెలవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారన్నారు.
కేరళలో ఎల్‌డీఎఫ్ గెలవాలని కోరుకుంటున్న ప్రధాని
శబరిమల బంగారం కుంభకోణంపై మోదీ ఒక్క మాట మాట్లాడరేం?
కేరళ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్
కన్నూరు, మార్చి 31: కేరళలో సీపీఎం, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎల్‌డీఎఫ్ గెలవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారన్నారు. మంగళవారం కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తాజా ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), బీజేపీ సంయుక్త కూటమితో పోరాడుతోందని చెప్పారు. యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సీపీఎం మాజీ నేతలిద్దరు కూడా రాహుల్ సభలో ఉండడం గమనార్హం. వామపక్ష ఫ్రంట్, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందని, రెండు పూర్తి వ్యతిరేక సిద్ధాంతాలు కలిగిన పార్టీల మధ్య ఒప్పందం కుదరడం ఇదే తొలిసారని రాహుల్ అన్నారు. అసలు ఇదెలా సాధ్యమైందో అర్థం కావడం లేదని, ఒక చిక్కుముడిలా ఉందని పేర్కొన్నారు. ‘‘ఈ చిక్కుముడికి కొన్ని సమాధానాలు వేదికపైనే ఉన్నాయి. సీపీఎంకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఇక్కడ ఉన్నారు. వాళ్లిద్దరూ సీపీఎం, సీఎం తరఫున ప్రచారం చేయకుండా మన వేదికపైన ఎందుకు కూర్చున్నారు?’’ అని రాహుల్ ప్రశ్నించారు. లెఫ్ట్ ఫ్రంట్ బీజేపీతో భాగస్వామ్యం కుదుర్చుకుందన్నారు. సీపీఎం కూడా కార్పొరేట్ పార్టీలా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడికి వెళ్లినా మతం, ఆలయాలు, దేవుళ్ల గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. శబరిమల ఆలయంలో జరిగిన బంగారం కుంభకోణాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. ఈ కుంభకోణంలో సీపీఎం నేతలు కూడా భాగస్వాములు కాబట్టే ఆయన మాట్లాడడంలేదని చెప్పారు. కేరళలో ఈ నెల 9న జరగనున్న ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారన్నారు. ‘‘నాపై 36 కేసులు ఉన్నాయి. నా ఇంటిని, లోక్‌సభ సభ్యత్వాన్నీ లాగేసుకున్నారు. నన్ను ఈడీ అధికారులు 55 గంటల పాటు ప్రశ్నించారు’’ అని చెప్పిన రాహుల్.. కేరళ సీఎంపై ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేరళలో మహిళల సాధికారత, భద్రత కోసమే ఐదు గ్యారెంటీలను ఎన్నికల హామీగా ప్రకటించినట్లు రాహుల్ చెప్పారు. అనంతరం ఆయన కోజికోడ్ జిల్లాలోని కోయలాండీలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా మోదీ సర్కారు ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీస్ పథకంతో ఉపయోగం లేదని రాహుల్ అన్నారు. ఏ నగరాన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడమే ఈ పథకం లక్ష్యమని ఆరోపించారు. మోదీ సర్కారు నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ పథకమే చక్కని ఉదాహరణని రాహుల్ తన యూట్యూబ్ చానెల్‌లో ధ్వజమెత్తారు.