పోలీసులు, లాఠీలకు భయపడొద్దు
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:22 AM
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునేవారంతా నవంబరు 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రాంలీలా మార్చ్’కు తరలిరావాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
రాజ్యాంగాన్ని రక్షించేందుకు కలిసి నడుద్దాం
1న ‘చలో ఢిల్లీ’ మార్చ్‌కు తరలి రండి: రాహుల్
న్యూఢిల్లీ, అక్టోబరు 29: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునేవారంతా నవంబరు 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రాంలీలా మార్చ్’కు తరలిరావాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పోలీసుల చర్యలకు ఎవరూ భయపడొద్దన్నారు. ‘‘పోలీసులకు, లాఠీలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ఏం చేయలేదు. మాతో కలిసి మార్చ్‌లో పాల్గొనండి. అందరం కలిసి రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ఇది దేశానికి సంబంధించిన మార్చ్. ఇది మీ మార్చ్. మీరంతా తరలి రండి’’ అని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో వీడియో సందేశం పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ఓట్ చోరీని అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడేందుకే తమ పోరాటమని పేర్కొన్నారు. ఈ మార్చ్ ఏ రాజకీయ పార్టీకీ చెందింది కాదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ల వల్ల ప్రజలంతా విసిగిపోయారని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునేవారంతా మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. అలాగే పార్టీలకతీతంగా విద్యార్థి సంఘాలు కూడా మార్చ్‌లో పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చారు.