Rahul Gandhi: రోహిత్ వేముల చట్టం తేవాల్సిందే: రాహుల్
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:29 AM
దేశంలో దళిత యువత పరిస్థితిలో ఇప్పటికీ ఏ మార్పూ రాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.
న్యూఢిల్లీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): దేశంలో దళిత యువత పరిస్థితిలో ఇప్పటికీ ఏ మార్పూ రాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. రోహిత్ వేముల పదో వర్ధంతి సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘రోహిత్ మనకు దూరమై పదేళ్లు గడిచినా అతను లేవనెత్తిన.. ఈ దేశంలో కలలు కనే హక్కు అందరికీ సమానంగా ఉందా? అనే ప్రశ్న మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇన్నేళ్లయినా దళిత యువత వాస్తవ పరిస్థితుల్లో మార్పు శూన్యం. నేటికీ క్యాంప్‌సలలో అదే తిరస్కారం, హాస్టళ్లలో అదే వెలి, తరగతి గదుల్లో అదే చిన్నచూపు కొనసాగుతున్నాయి. కొన్నిసార్లు హింస, మరణాలు సంభవిస్తున్నాయి. నేటికీ ఈ దేశంలో కులమే అతిపెద్ద అడ్మిషన్ ఫారమ్‌గా ఉంది. విద్యాసంస్థల్లో కులవివక్షను నిర్మూలించేందుకు రోహిత్ వేముల చట్టం తీసుకరావడం తక్షణ అవసరం. కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.