ఆత్మరక్షణలో బీజేపీ సర్కారు!
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:47 AM
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో తన ప్రసంగాన్ని పూర్తి చేసేంతవరకూ సభ కార్యకలాపాలకు అడ్డు తగులుతూనే ఉంటామని ...
నరవణే ప్రకటనపై రాహుల్ గాంధీ ప్రసంగించాల్సిందేనంటున్న విపక్షం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో తన ప్రసంగాన్ని పూర్తి చేసేంతవరకూ సభ కార్యకలాపాలకు అడ్డు తగులుతూనే ఉంటామని ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో బుధవారం కూడా లోక్‌సభా సమావేశాలు స్తంభించిపోయాయి. ఒకరిద్దరు సభ్యులు ప్రసంగించినప్పటికీ ప్రతిపక్షాల హోరు మధ్య సభను వాయిదా వేయాల్సివచ్చింది. ఈ విషయంలో బీజేపీ సర్కారు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లో చైనా సైన్యాలు ప్రవేశించినప్పటికీ తమకు ఎలాంటి దిశా నిర్దేశం చేయకుండా ప్రధాని, రక్షణ మంత్రి తప్పించుకున్నారంటూ నరవణే రాసిన పుస్తకం ప్రతులను ప్రధానికి స్వయంగా సభలో ఇస్తానని రాహుల్ ప్రకటించడం, రోజంతా సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతుండడంతో ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ‘‘ప్రధానమంత్రి భయపడ్డారు. ఆయన సభకు హాజరు కారు’’ అని రాహుల్ బుధవారం ఉదయం మీడియా ముందు అన్నట్టుగానే.. మోదీ సభకు హాజరు కాకపోవడం గమనార్హం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ జరిగిన చర్చకు సాయంత్రం 5 గంటలకు జవాబివ్వాల్సిన ప్రధాని మోదీ అసలు ఉదయం నుంచే సభకు హాజరు కాకపోవడం.. స్పీకర్ ఓం బిర్లా కూడా చాంబర్‌కే పరిమితం కావడంతో.. ఏమి జరుగుతుందా? అనేఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. ఇప్పటికే ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్.. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్‌సభలో 220 మందికి పైగా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయలేరని, అలా చేస్తే తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. స్పీకర్ ఓం బిర్లా కూడా.. అది సాధ్యం కాదని చెప్పినట్లు తెలుస్తోంది. తెర వెనుక మంత్రాంగంతో ప్రధాని ప్రసంగానికి వీలు కల్పించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రయత్నిస్తున్నప్పటికీ.. విపక్షాలు అందుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. రాహుల్ ప్రసంగాన్ని అనుమతించి ఉంటే సమస్య సమసిపోయేదని.. అనవసరంగా అడ్డుకుని చిక్కుల్లో పడిపోయామని బీజేపీ వర్గాలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పూర్తి చేయకుండానే లోక్‌సభను వాయిదా వేయాల్సి వస్తుందా, రాజ్యసభలో మాత్రమే చర్చ జరిగి ప్రధాని జవాబిస్తారా అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతోపాటు.. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను బయటపెట్టాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై కూడా మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇంకా ఒప్పందంపై సంతకాలు కాలేదని, అనేక వ్యవసాయ ఉత్పత్తులను అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోందని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందంపై సంతకం కాకుండానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం, వ్యవసాయ ఉత్పత్తులు సహా.. 500 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.45 లక్షల కోట్ల) మేర అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని, రష్యా నుంచి చమురు కొనడం మానివేస్తుందని ప్రకటించడంపై కూడా మోదీ సర్కార్ జవాబు చెప్పలేని పరిస్థితుల్లో పడింది. కాగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రతిపక్షాలు గురువారం ఉదయం పది గంటలకు సమావేశమవుతున్నాయి. లోక్‌సభలో చర్చను అనుమతించకపోతే రాజ్యసభనూ స్తంభింపజేయాలని, ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే.. మోదీ పార్లమెంట్‌కు వచ్చే అవకాశాల్లేవని ఎన్డీయే నాయకుడొకరు తెలిపారు.