ఎప్‌స్టీన్ భయంతోనే మోదీ లొంగిపోయారు!
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:47 AM
ఎప్‌స్టీన్ ఫైళ్ల భయం, అదానీ మీద అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసు ఒత్తిడి నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. అమెరికాతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారు
ఆ ఒప్పందం రైతులకు శరాఘాతం: రాహుల్
మోదీ అంత పిరికి ప్రధానిని చూళ్లేదు: ఖర్గే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఎప్‌స్టీన్ ఫైళ్ల భయం, అదానీ మీద అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసు ఒత్తిడి నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. అమెరికాతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం దేశంలోని రైతులకు పూర్తిగా వ్యతిరేకమైనదన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం జరిగిన కిసాన్ మహాచౌపల్ (రైతుల మహాసభ)లో ప్రసంగిస్తూ రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే ధైర్యం ఉందా? అంటూ మోదీకి సవాల్ విసిరారు. ఒప్పందం వెనుక రెండు కారణాలున్నాయన్నారు. ‘మొదటిది.. ఎప్‌స్టీన్ ఫైళ్లు. ఈ ఫైళ్లలో కేంద్ర మంత్రి హర్దీ్‌పసింగ్‌పురీ పేరు కూడా ఉంది. వాటిని చూపెట్టి మోదీని భయపెట్టారు. మా మాట వినకపోతే ఫైళ్లలోని అంశాలను బయటపెడతామన్నారు. ఇక, రెండో కారణం.. అమెరికాలో అదానీపై నమోదైన క్రిమినల్ కేసు. ఇది మోదీ లక్ష్యంగా అదానీ మీద పెట్టిన కేసు’ అని రాహుల్ అన్నారు. ఇదే సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ, 60ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ అంతటి పిరికి ప్రధానిని చూడలేదన్నారు.