ఎప్‌స్టీన్ ఫైల్స్ భయంతోనే..ట్రంప్‌తో ప్రధాని మోదీ రాజీ
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:20 AM
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు బయటకు రావటంతో పరువు పోతుందని భయపడి ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో రాజీపడ్డారని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు: రాహుల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు బయటకు రావటంతో పరువు పోతుందని భయపడి ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో రాజీపడ్డారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. మంగళవారం పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎందుకంటే ఏవైతే ఆయనకు గౌరవప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయో.. అవే ఇప్పుడు ఆ ప్రతిష్ఠను ముక్కలు చేస్తున్నాయి. అదానీపై అమెరికాలో నమోదైన కేసు, ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు.. ఈ రెండు పరిణామాలతో ప్రధాని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆయన రాజీ పడ్డారు. మోదీ భయపడుతున్నారు కాబట్టే కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపైౖ ఆగమేఘాల మీద సంతకం చేసి, భారతీయుల కష్టార్జితాన్ని అమెరికాకు అమ్మేశారు’ అని రాహుల్‌గాంధీ విమర్శించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మొదటిసారి సభలో ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ విమర్శించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల గురించి పార్లమెంటుకు ఎలాంటి సమాచారం ఇవ్వటంలేదని మండిపడ్డారు. అమెరికాతో ఒప్పందం గురించి ఆ దేశాధ్యక్షుడు చెపితేగానీ తెలుసుకోలేకపోయామని అన్నారు.