ఓటు చోరీకి మూల్యం చెల్లించుకోక తప్పదు
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:07 AM
ఓటు చోరీకి పాల్పడినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
మోదీ, షాను కోర్టు ముందు నిలబెడతాం: రాహుల్
మార్గావ్/న్యూఢిల్లీ, అక్టోబరు 18: ఓటు చోరీకి పాల్పడినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. గోవాలోని మార్గావ్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గోయ్ రాఖోన్ యాత్ర’లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రెండు కిలోమీటర్లు నడిచిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఈసీ ఓటు చోరీకి పాల్పడుతుంటే.. మోదీ, షా ఆయనకు అండగా నిలుస్తున్నారనే విషయం దేశమంతటికీ తెలుసునని రాహుల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తప్పు చేసిన మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్ కుమార్ తమ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.