Share News

రాఘవ్‌ చద్ధాకు ఆప్‌ షాక్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:31 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో ఆప్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ రాఘవ్‌ చద్ధాను ఆ బాధ్యతల నుంచి పార్టీ నాయకత్వం తప్పించింది.

రాఘవ్‌ చద్ధాకు ఆప్‌ షాక్‌

  • రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా తొలగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో ఆప్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ రాఘవ్‌ చద్ధాను ఆ బాధ్యతల నుంచి పార్టీ నాయకత్వం తప్పించింది. ఆయన స్థానంలో అశోక్‌ మిట్టల్‌ను నియమించింది. ఆప్‌కు సంబంధించిన పలు అంశాల్లో చద్ధా మౌనంగా ఉంటుండటం, పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు దూరంగా ఉంటుండడమే చద్ధా తొలగింపునకు కారణమని పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 2024 మార్చిలో కేజ్రీవాల్‌ను, సిసోడియాను అరెస్టు చేసిన సమయంలో చద్ధా అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉండిపోయారు. 6నెలలపాటు వారు జైలులో ఉన్నా ఒక్కసారి కూడా వారిని కలవకపోవడం, జైలు నుంచి విడుదలయ్యాక కూడా కొద్దిరోజుల తరువాత కలవడం పార్టీ నాయకత్వం పట్ల చద్ధాకు విధేయత లేదన్న సంకేతాలనిచ్చింది. అనంతరం కేజ్రీవాల్‌, సిసోడియా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు, జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ర్యాలీకి కూడా చద్ధా గైర్హాజరయ్యారు. వీటన్నింటి నేపథ్యంలోనే ఆప్‌ నాయకత్వం రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి నుంచి తొలగించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అంశంపై చద్ధా శుక్రవారం స్పందిస్తూ పార్లమెంటులో తాను మాట్లాడకుండా తన సొంత పార్టీయే అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. తాను మౌనంగా ఉన్నాను తప్ప.. ఓడిపోలేదని అన్నారు. తాను దేశంలోని సామాన్యుల గురించి, వారి సమస్యల గురించే మాట్లాడానని, విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక రేట్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, టోల్‌ ప్లాజా చార్జీలు, మొబైల్‌ డాటా ఎక్స్‌పైరీ, మధ్యతరగతి ప్రజలపై పన్నులు వంటి అంశాలపై పార్లమెంటులో మాట్లాడానని గుర్తు చేశారు. ఈ అంశాలపై మాట్లాడటం నేరమా? అని ప్రశ్నించారు. మరోవైపు, కేంద్రాన్ని, బీజేపీని నిలదీసేందుకు చద్ధా ఎందుకు భయపడుతున్నారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి ప్రశ్నించారు. మరోవైపు పంజాబ్‌ సీఎం మాన్‌.. చద్ధా వ్యవహారశైలిని తప్పుబడుతూనే రాజకీయ పార్టీలు పార్లమెంటులో తమ ఫ్లోర్‌ లీడర్లను మార్చడం సాధారణమేనన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 04:31 AM