‘ఆర్‌ఏసీ‘లో బెర్త్ రాకుంటే టికెట్ చార్జీలో కొంత తిరిగివ్వాలి!
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:39 AM
అత్యవసర లేదా ఇతర సమయాల్లో టికెట్లు అందుబాటులో లేనప్పటికీ.. చాలా మంది ‘ఆర్‌ఏసీ (రిజర్వేషన్ ఆగైనెస్టు క్యాన్సిలేషన్)’ క్యాటగిరీలో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అయితే బోర్డింగ్ సమయానికి ...
రైల్వే శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: అత్యవసర లేదా ఇతర సమయాల్లో టికెట్లు అందుబాటులో లేనప్పటికీ.. చాలా మంది ‘ఆర్‌ఏసీ (రిజర్వేషన్ ఆగైనెస్టు క్యాన్సిలేషన్)’ క్యాటగిరీలో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అయితే బోర్డింగ్ సమయానికి ఎవరైనా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటేనే వారికి బెర్త్‌లు కేటాయించబడతాయి. అది కూడా ముందు, వెనుక అనే ఒక క్రమ పద్ధతిలో! లేదంటే మరో వ్యక్తితో కలిసి ఒకే బెర్త్‌ను పంచుకొని రైలు ప్రయాణం చేయాల్సిందే!! ఇందుకుగానూ సదరు వ్యక్తికి సగం బెర్త్ కేటాయించినప్పటికీ.. టికెట్ బుకింగ్ సమయంలో పూర్తి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా ఆర్‌ఏసీ క్యాటగిరీ కింద టికెట్లు బుక్ చేసుకొని, చార్ట్ తయారీ తర్వాత కూడా ఆదే క్యాటగిరీలో ఉండి, ఫుల్ బెర్త్ లేకుండా ప్రయాణించే వారి నుంచి పూర్తి చార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అలాంటి ప్రయాణికులకు చార్జీలో కొంత మేర రీఫండ్ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సూచించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజాపద్దుల కమిటీ ‘పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్’ పేరుతో బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.