ఇంధన భద్రతే లక్ష్యంగా ఇండో పసిఫిక్
ABN , Publish Date - May 27 , 2026 | 04:00 AM
ఇంధన సరఫరాలో తలెత్తే అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి క్వాడ్ కూటమి.. ‘ఇండో పసిఫిక్ ఇంధన భద్రత మార్గదర్శక ప్రణాళిక’ను విడుదల చేసింది..
హొర్ముజ్‌పై ఆంక్షలు వద్దు.. ప్రపంచ సముద్ర వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలి
క్వాడ్ విదేశాంగమంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన
న్యూఢిల్లీ, మే 26: ఇంధన సరఫరాలో తలెత్తే అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి క్వాడ్ కూటమి.. ‘ఇండో పసిఫిక్ ఇంధన భద్రత మార్గదర్శక ప్రణాళిక’ను విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పరస్పర సమన్వయానికి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది తోడ్పడుతుందని తెలిపింది. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో కీలక మార్గమైన హొర్ముజ్ జలసంధి ఇరాన్ ఆంక్షలతో నిలిచిపోయిన నేపథ్యంలో క్వాడ్ ఈ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. మంగళవారం ఢిల్లీలో విదేశాంగమంత్రి జైశంకర్ అధ్యక్షతన క్వాడ్ విదేశాంగమంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీలో రుబియో(అమెరికా), పెన్నీ వాంగ్(ఆస్ట్రేలియా), తొషిమిత్సు మొటెగి(జపాన్) పాల్గొన్నారు. హొర్ముజ్ జలసంధితోపాటు సముద్ర రవాణామార్గాలు అన్నీ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వాణిజ్య నౌకల రవాణాకు ఏ అడ్డంకులూ ఉండకూడదని ఈ సమావేశం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ‘సమర్థవంతమైన ఆర్థిక, ఇంధన వ్యవస్థలతో కూడిన స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణమే క్వాడ్ లక్ష్యం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కీలక ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకుంటామని, తీరప్రాంత గస్తీని మరింత బలోపేతం చేస్తామని ఈ ప్రకటన తెలిపింది. రానున్న రోజుల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం పెరుగుతుందని, ఇందుకు క్వాడ్ దేశాలు సిద్ధం కావాలని జైశంకర్ ఈ సందర్భంగా అన్నారు.
ఖనిజాల సరఫరాపై భారత్, అమెరికా ఒప్పందం
కీలక ఖనిజాల సరఫరాకు సంబంధించి భారత్, అమెరికా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆధునిక టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే రేర్ ఎర్త్ మూలకాలు, కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా నియంత్రణలు విధిస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ఇరుదేశాలకు సహాయకారిగా నిలువనుంది. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లిండ్, పెట్టుబడులకు సంబంధించి పరస్పరం సహకరించుకోవటానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని జైశంకర్ తెలిపారు.