ఇంటికి తిరిగెళ్లేదెలా..?
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:30 AM
మేమున్న చోటుకి అత్యంత సమీపంలోనే బాంబు పేలింది, ఆ దట్టమైన పొగను చూడండి.. ఇప్పుడేం చెయ్యాలో తెలియడం లేదు... భయం వేస్తుంది..
దుబాయ్, ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికుల భయాందోళన
పరిస్థితి భయానకంగా ఉంది : సింధు
న్యూఢిల్లీ, దుబాయ్, మార్చి 1 : మేమున్న చోటుకి అత్యంత సమీపంలోనే బాంబు పేలింది, ఆ దట్టమైన పొగను చూడండి.. ఇప్పుడేం చెయ్యాలో తెలియడం లేదు... భయం వేస్తుంది.. ఎవరిని సాయం అడగాలో తెలియడం లేదు.. క్షణక్షణానికి పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. ఇంటికి ఎలా తిరిగెళ్లాలో, మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు... ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సైనిక చర్య నేపథ్యంలో విమానయానం స్తంభించిపోయి దుబాయ్ సహా ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారి ఆవేదన ఇది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్‌ఎల్ బోజేగౌడ, బెంగాలీ నటి శుభశ్రీ గంగూలీ వంటి ప్రముఖలతో పాటు విద్యార్థి బృందాలు, పర్యాటకులు వందలాది మంది భారతీయులు వేర్వేరు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు. తమ ప్రయాణాలు ఆఖరి నిమిషంలో రద్దు కావడంతో వీళ్లలో చాలా మంది చేతిలో సరిపడా డబ్బు లేక ప్రత్యామ్నాయం తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంజాన్ నేపథ్యంలో ఉమ్రా చేయడానికి భారత్ నుంచి వచ్చిన వేలాది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు విమానాలు లేక సౌదీలో ఉండిపోయారు. ఓ సదస్సు కోసం బహ్రెయిన్ వచ్చిన దాదాపు 400 మంది తెలుగు కుటుంబాలు విమానాశ్రయ మూసీ వేతతో అక్కడే ఇరుక్కుపోయారు. వీరు బస చేసిన హోటల్ సమీపంలో పేలుళ్లు సంభవించడంతో వీరిని మరో హోటల్‌కు తరలించారు. వీళ్లలో చాలా మంది చేతిలోని డబ్బు అయిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దుబాయ్, అబుధాబి, దోహా నగరాలలో కూడా వేలాది ప్రయాణికులు తదుపరి విమానాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, కుమారుడు యువాన్‌తో కలిసి శుభశ్రీ గంగూలీ.. ఓ హోటల్‌లో ఉండిపోయారని, ఆ హోటల్‌కు సమీపంలో పేలుడు జరిగిందని ఆమె భర్త, టీఎంసీ ఎమ్మెల్యే రాజ్ చక్రబోర్తి తెలిపారు. పుణెలోని ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీ్‌స(ఐఎ్‌సబీఎ్‌స)కు చెందిన 84 మంది విద్యార్థులు ఐదు రోజుల స్టడీ టూర్‌కు దుబాయ్ వెళ్లి ప్రస్తుతం అక్కడ చిక్కుకున్నారు. విద్యార్థులందరినీ ఓ హోటల్‌కు తరలించామని సురక్షితంగా ఉన్నారని కళాశాల ప్రతినిధులు చెబుతున్నారు. కానీ విద్యార్థులను స్వదేశానికి తెచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో బళ్లారి, చిద్రదుర్గకు చెందిన 50మందికిపైగా మహిళలు, పురుషులు చిక్కుకున్నారు. బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డితో పాటు 35 మంది బళ్లారి వాసులు, చిత్రదుర్గకు చెందినవారు దుబాయ్ పర్యటనకు వెళ్లారు. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన సర్వీసులు ఆపేయడంతో వారంతా దుబాయ్‌లో చిక్కుకున్నారు.
ఆ క్షణం భయంతో పరుగులు తీశాం..
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హమ్ బయలుదేరిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. తన కోచ్‌తో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో ఇరుక్కుపోయారు. ‘‘ ఇక్కడి భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. గంటకు గంటకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. కొన్ని గంటల ముందు విమానాశ్రయంలో మేమున్న చోటుకి కొద్ది దూరంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. నా కోచ్‌తో సహా అందరం భయంతో పరుగులు తీశాం. అది మా అందరికీ భయానక క్షణం’’ అంటూ తన అనుభవాన్ని పీవీ సింధు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే, ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నామని, దుబాయ్ విమానాశ్రయ సిబ్బంది తమకు తగిన సహకారం అందించారని సింధు పేర్కొన్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.