భారత వైవిధ్యం అద్భుతం
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:59 AM
భారత దేశ సంస్కృతి, నాగరికత, భాషా వైవిధ్యాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కొనియాడారు. 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సుమారు 60 కోట్ల మంది మాత్రమే దేశ అధికారిక భాష మాట్లాడతారని..
ఆ దేశ నాగరికత తెలుసుకునే కొద్దీ ఆసక్తి కలిగిస్తోంది
ఓ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్
150 కోట్ల జనాభాలో అధికారిక భాష మాట్లాడేది 60 కోట్లే
మిగిలిన వారు మాట్లాడేది తమ మాతృ భాషే
ప్రధాని మోదీతో తన సంభాషణను ప్రస్తావించిన పుతిన్
న్యూఢిల్లీ, నవంబరు 22: భారత దేశ సంస్కృతి, నాగరికత, భాషా వైవిధ్యాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కొనియాడారు. 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సుమారు 60 కోట్ల మంది మాత్రమే దేశ అధికారిక భాష మాట్లాడతారని, అయినా సరే దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండడం అద్భుతమని ప్రశంసలు కురిపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీకి తనకు మధ్య జరిగిన సంభాషణను చెబుతూ భారతదేశ నాగరికతపై ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్ విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. ‘‘ఉదాహరణకు భారతదేశ నాగరికతను చూడండి.. ఎంతో పురాతనమైనది. ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆ నాగరికత కోసం తెలుసుకునే కొద్దీ అది నన్ను మరింత ఆకట్టుకుంటోంది. ఈ మధ్య భారత ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు... మీ దేశంలో ఎంత మంది ప్రజలు అధికారిక భాష మాట్లాడతారు ? అని అడిగా.. దాదాపు 60 కోట్ల మంది మాట్లాడతారని మోదీ బదులిచ్చారు. దానికి మొత్తం దేశ జనాభా ఎంత? అని నేను అడిగితే 150 కోట్లు అని మోదీ చెప్పారు. ఏంటి మొత్తం జనాభాలో మూడో వంతు మంది మాత్రమే అధికారిక భాష మాట్లాడితే మిగిలిన వాళ్లు ఏ భాష మాట్లాడతారని మోదీని అడిగా. మిగిలిన ప్రజలు తమ మాతృభాష మాట్లాడతారని ఆయన చెప్పారు.
ఇది నిజంగా అద్భుతం కదా..!! నిజంగా అద్భుతం’’ అని అన్నారు. భారతదేశ సంస్కృతిని పుతిన్ గత నెలలో జరిగిన ఓ చర్చావేదికలోనూ కొనియాడారు. భారతదేశమంటే ప్రత్యేకత, వైవిధ్యం, ఐకమత్యం అని అభివర్ణించారు. భారతదేశం తన వైవిధ్యంతో అందరినీ అబ్బురపరుస్తుందని పుతిన్ పేర్కొన్నారు. కాగా, భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరిగా ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఏడాది సెప్టెంబరు 11న కలిసి మాట్లాడుకున్నారు.