Share News

పంజాబ్‌ మంత్రి సంజీవ్‌ అరోరా అరెస్టు

ABN , Publish Date - May 10 , 2026 | 05:36 AM

తప్పుడు బిల్లులు సృష్టించి దాదాపు రూ.150 కోట్ల వరకు పన్ను ఎగవేశారన్న అభియోగాలపై పంజాబ్‌ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్‌ అరోరాను ఈడీ శనివారం అరెస్టు చేసింది.

పంజాబ్‌ మంత్రి సంజీవ్‌ అరోరా అరెస్టు

  • మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసిన ఈడీ

న్యూఢిల్లీ/చండీగఢ్‌, మే 9: తప్పుడు బిల్లులు సృష్టించి దాదాపు రూ.150 కోట్ల వరకు పన్ను ఎగవేశారన్న అభియోగాలపై పంజాబ్‌ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్‌ అరోరాను ఈడీ శనివారం అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయనను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అంతకు ముందు ఢిల్లీ, చండీగఢ్‌, గురుగ్రామ్‌లో ఐదుచోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. అరోరా ఇళ్లు, కార్యాలయాలతోపాటు ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. అరోరా డైరెక్టర్‌గా ఉన్న హ్యాంప్టన్‌ స్కై రియాల్టీ లిమిటెడ్‌ సంస్థ ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో గత నెలలోనే అరోరాను ఈడీ ప్రశ్నించింది. దర్యాప్తునకు సహకరించటం లేదని ఆరోపిస్తూ శనివారం అరెస్టు చేసింది. లుథియానా పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి అరోరా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సంజీవ్‌ అరోరా అరెస్టుపై ఆప్‌ జాతీయ క న్వీనర్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2027లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసి బీజేపీ గెలవాలని కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఈడీతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ‘‘ఎన్ని చేసినా పంజాబ్‌లో బీజేపీ అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవటం ఖాయం’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మధ్యయుగంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ దేశాన్ని ఆక్రమించినట్లే.. మోదీ కూడా బలప్రయోగంతో రాష్ట్రాలను ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు.

Updated Date - May 10 , 2026 | 05:36 AM