మొహర్రం ఊరేగింపులో విషపు గోలీల పంపిణీ కేసులో నిందితుడిపై 700 పేజీల చార్జిషీట్
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:03 AM
గత జూన్‌లో ఫుణెలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఆ నగరానికే చెందిన ఫయాజ్ ప్రేమ్‌జీ అనే 39 ఏళ్ల వ్యక్తి దాదాపు 15వేల మందికి ఎలుకల మందు కలిపిన క్యాప్సుల్స్ ఇచ్చి చంపేందుకు పథకం వేసి..
ముంబై, అక్టోబరు 4: గత జూన్‌లో ఫుణెలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఆ నగరానికే చెందిన ఫయాజ్ ప్రేమ్‌జీ అనే 39 ఏళ్ల వ్యక్తి దాదాపు 15వేల మందికి ఎలుకల మందు కలిపిన క్యాప్సుల్స్ ఇచ్చి చంపేందుకు పథకం వేసి.. అమలులోకి దిగడం తాలూకు ఘటన గుర్తుకుందా? ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఫయాజ్‌కు వ్యతిరేకంగా 700 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. దీని ప్రకారం.. ఎలుకలను చంపేందుకు ఉపయోగించే జింక్ పాస్పేట్‌ను ఫయాజ్ 50 కిలోల మేర సేకరించాడు. రెండు వారాలు శ్రమించి దానిని గోలీల్లాగా (క్యాప్సూల్స్) తయారు చేశాడు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా తాను సిద్ధం చేసిన క్యాప్సుల్స్‌ను తీసుకెళ్లి మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందంటూ జనానికి ఇవ్వసాగాడు. పదుల సంఖ్యలో మాత్రలు పంచిపెట్టిన అనంతరం తీసుకున్న ప్రజలు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా తన మతానికే చెందిన కొందరితో తనకున్న వ్యక్తిగత విభేదాల కారణంగా మొత్తంగా ఆ వర్గంపైనే పగ పెంచుకొని మొహర్రం ఊరేగింపును ఫయాజ్ లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.