నెలకు రూ.1.40 లక్షల జీతం గల మహిళకు నెలవారీ భరణం కింద రూ.1.35 లక్షలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:55 AM
నెలకు రూ.1.40 లక్షలు సంపాదిస్తున్న ఓ యువతికి భరణం కింద భర్త నెలకు రూ.1.35 లక్షలు ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
పెళ్లయిన 6నెలలకే విడాకులు.. భర్త జీతంలో సగం ఆమెకే
పుణె, జూన్ 9: నెలకు రూ.1.40 లక్షలు సంపాదిస్తున్న ఓ యువతికి భరణం కింద భర్త నెలకు రూ.1.35 లక్షలు ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది. ఎక్స్‌లోని ఓ పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పుణెకు చెందిన దంపతులిద్దరూ ఉద్యోగులే! అయితే పెళ్లయిన ఆర్నెల్లకే ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భర్త సంపాదన నెలకు రూ.2.79,499! భార్య జీతం నెలకు 1,41,436. భర్త, తన తల్లిదండ్రుల బాధ్యత కూడా చూసుకుంటున్నాడు. తాను భర్త నుంచి విడిపోయాక జీవనం సాగించడానికి సరిపడా జీతం పొందుతున్నప్పటికీ పెళ్లయిన ఆరు నెలల్లో తాను కొనసాగించిన జీవనశైలిని విడాకుల తర్వాత కూడా కొనసాగించే హక్కు తనకు ఉందని, తనకు భరణం కావాలని ఆమె కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆ భర్తకు తన జీతంలో సగం అంటే రూ.1.35 లక్షలను ఆమెకు భరణంగా చెల్లించాలని తీర్పిచ్చింది. అందునా.. భరణం మొత్తం ‘వ్యక్తిగత ఖర్చుల’ కిందకు వస్తుంది కాబట్టి ఆ భర్తకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా దక్కదు. అంటే.. అతడు, నెలనెలా ఆమెకు భరణం చెల్లించినా తాను పొందుతున్న పూర్తి జీతానికి సంబంధించి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ తీర్పును నెటిజెన్లు తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నారు.