Share News

ప్రముఖ చరిత్రకారుడు కేఎన్‌ ఫణిక్కర్‌ మృతి

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:09 AM

ప్రముఖ చరిత్రకారుడు కేఎన్‌ ఫణిక్కర్‌(89) సోమవారం మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ప్రముఖ చరిత్రకారుడు కేఎన్‌ ఫణిక్కర్‌ మృతి

తిరువనంతపురం, మార్చి 10 : ప్రముఖ చరిత్రకారుడు కేఎన్‌ ఫణిక్కర్‌(89) సోమవారం మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఫణిక్కర్‌ బ్రిటీష్‌ కాలం నాటి, ఆధునిక భారత చరిత్రపై పలు పుస్తకాలు రచించి ఎంతో గుర్తింపు పొందారు. చరిత్ర రచనలో మార్క్సిస్ట్‌, లౌకిక, శాస్త్రీయ దృక్పథాలను అవలంబించినందుకు గుర్తింపు పొందారు. చరిత్ర బోధన, రచనలో ఆర్థిక, రాజకీయ అంశాలు ఆధిపత్యం వహిస్తున్న తరుణంలో ఫణిక్కర్‌ సంస్కృతిని కూడా ప్రధానంగా తీసుకున్నారు. బిపిన్‌ చంద్ర, సవ్యసాచి భట్టాచార్య, ఎస్‌. గోపాల్‌ వంటి చరిత్రకారులతో ఈయన్ను పోల్చుతారు. ఆయన మరణంతో ప్రముఖ చరిత్రకారుడినే గాక, ఒక ప్రజా మేధావిని కోల్పోయినట్లుగా పలువురు పేర్కొంటున్నారు. ఫణిక్కర్‌ ఉన్నత విద్య అనంతరం రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం, హన్సరాజ్‌ కాలేజీలలో చేశారు. అనంతరం దిల్లీలోని జేఎన్‌యూలో చరిత్ర ఆచార్యుడిగా చేరారు. చరిత్రను విశ్వవిద్యాలయం తరగతి గదులకు పరిమితం చేయకుండా ప్రజాస్వామ్య అవగాహన, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించేదిగా ఆయన భావించారు. దశాబ్దాల చరిత్ర అధ్యయనం ద్వారా సెక్యులరిజం, బహుళవాదాన్ని సమర్థించారు. చరిత్ర ద్వారా సమాజానికి సేవ చేయాలని భావించేవారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Updated Date - Mar 11 , 2026 | 04:09 AM