Share News

ప్రజాస్వామ్యంపై కేంద్రం ప్రత్యక్ష దాడి

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:18 AM

ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థను, మీడియాను అణిచివేస్తూ ప్రజాస్వామ్యంపై పరోక్ష దాడి చేస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష దాడికి దిగిందని కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ ఆరోపించారు.

ప్రజాస్వామ్యంపై కేంద్రం ప్రత్యక్ష దాడి

  • ఇప్పటిదాకా ఈసీ, న్యాయవ్యవస్థ, మీడియాను అణిచివేస్తూ పరోక్ష దాడి చేసింది

  • ముగ్గురు సభ్యుల పునర్విభజన కమిషన్‌ రాష్ట్రాల తలరాతను నిర్ణయిస్తుందా?

  • రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమైనట్లే

  • ఇదంతా అమిత్‌షా కుటిల రాజకీయం

  • చాణక్యుడు జీవించి ఉంటే ఇది చూసి మ్రాన్పడిపోయేవాడు: ప్రియాంక

  • జనగణనను ఆలస్యం చేయటానికే సవరణలు: అఖిలేశ్‌ యాదవ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థను, మీడియాను అణిచివేస్తూ ప్రజాస్వామ్యంపై పరోక్ష దాడి చేస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష దాడికి దిగిందని కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ముగ్గురు సభ్యులతో ఏర్పాటయ్యే పునర్విభజన కమిషన్‌.. రాష్ట్రాల తలరాతను, పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యాన్ని నిర్ణయించటం ఏమిటన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెట్టారని, ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్ల ఆధారంగానే ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. మహిళా బిల్లుకు తమ మద్దతు కొనసాగుతుందని, అయితే, ప్రభుత్వ ఉద్దేశాలపైనే సందేహంగా ఉందని చెప్పారు. అధికారపక్షం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యం అంతమైనట్లేనని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని, అయితే, చర్చ దానిపై కాదని, ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిన తీరుపైనే చర్చ జరుగుతోందని ప్రియాంక స్పష్టం చేశారు. ‘2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభలో సీట్లు 850కి పెరుగుతాయని చెబుతున్నారు. దాంట్లో 33 శాతం మహిళలకు కేటాయిస్తామంటున్నారు. పైకి చూస్తే ఇదంతా బాగానే ఉన్నట్లు ఉంటుంది. కానీ, లోపల రాజకీయ కోణాలున్నాయి. ముగ్గురు సభ్యులతో ఏర్పాటయ్యే పునర్విభజన కమిషన్‌ రాష్ట్రాల తలరాతను, వాటి ప్రాతినిధ్యాన్ని నిర్ణయించబోతోంది. ఇది దేశ ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడే’ అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌పై ఘనమైన మాటలు చెబుతూ మరోవైపు ఓబీసీల హక్కులను లాగేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల నాటికి చిన్న రాష్ట్రాల ప్రభావం లేకుండా వ్యవస్థలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం పథకం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాదేనని ప్రియాంక విమర్శించారు. దీనిపై సభలో ఉన్న అమిత్‌షా నవ్వులు చిందించటంతో.. ‘మీరు నవ్వుతున్నారు. కానీ, చాణక్యుడు జీవించి ఉంటే మీ కుటిల రాజకీయాల్ని చూసి మ్రాన్పడిపోయేవారు. ఈ విషయం మీరు కూడా ఒప్పుకుంటారు’ అంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు. ఓవైపు పలు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించటం ప్రభుత్వ పథకంలో భాగమని, దాంట్లో భాగంగానే అఖిలపక్ష భేటీ కూడా జరపలేదని, సమావేశాలకు కేవలం ఒక్కరోజు ముందే బిల్లుల ప్రతులను ప్రతిపక్షాలకు అందజేశారని తెలిపారు.


మహిళా హక్కుల వెనుక సుదీర్ఘ చరిత్ర

భారతదేశ రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అంశానికి సుదీర్ఘ చరిత్ర ఉందని ప్రియాంక తెలిపారు. ‘ఇది నెహ్రూతో ప్రారంభమైంది. మీరు (బీజేపీని ఉద్దేశించి) పక్కనపెట్టాలని చూసే (జవహర్‌లాల్‌) నెహ్రూ కాదు. మోతీలాల్‌ నెహ్రూ. 1928లో ఆయన సారథ్యంలోని ఒక కమిటీ 19 ప్రాథమిక హక్కుల జాబితాను తయారుచేసి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి సమర్పించింది. 1931లో కరాచీలో వల్లభాయ్‌పటేల్‌ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో ఈ హక్కులతో కూడిన తీర్మానాన్ని ఆమోదించారు. మహిళలకు సమాన హక్కులు అన్న అధ్యాయం భారతదేశంలో ఇలా మొదలైంది. అంతేగాక, ప్రతి మనిషికి ఒకే విలువతో కూడిన ఓటుహక్కు అనే భావన అప్పుడే ప్రారంభమైంది. దీని ఫలితంగానే, దేశానికి స్వాతంత్య్రం రాగానే మహిళలకు ఓటు హక్కు లభించింది. అమెరికా వంటి దేశాల్లో ఓటు హక్కు కోసం మహిళలు 150 ఏళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది’ అని ప్రియాంక వివరించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లును రాజీవ్‌గాంధీ హయాంలో తీసుకొచ్చారని, పీవీ నరసింహారావు హయాంలో అది ఆమోదం పొంది అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ‘చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్‌ కల్పించే బిల్లు యూపీఏ హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో దానికి ఆమోదం లభించలేదు. బిల్లును ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ 2018లో రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2023లో బిల్లు ఆమోదం పొందినప్పుడు కాంగ్రెస్‌ పూర్తిగా సమర్థించింది’ అని ప్రియాంక గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్‌ బీజేపీతోనే సాధ్యమవుతోందని ప్రధాని మోదీ చెబుతున్నారని.. కానీ, తమను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసేవారిని ప్రతి మహిళ గుర్తించగలదని, బీజేపీ జాగ్రత్తగా ఉండాలని చురకలు వేశారు.


మహిళా, బీసీ, రాజ్యాంగ, సమాఖ్య వ్యతిరేక బిల్లులు

అంతకుముందు, అధికారపక్షం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై కాంగ్రెస్‌ పక్ష ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌ చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో తనకు (బీజేపీకి) అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపి, అందరి మీదా రుద్దాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అస్సాం, జమ్మూ కశ్మీర్‌లలో బీజేపీకి అనుకూలంగా కేంద్రం జరిపిన నియోజకవర్గాల పునర్విభజన అస్తవ్యస్తంగా ఉందని, ఈ తరహా గందరగోళాన్ని ఇప్పుడు దేశమంతటా అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అలాగే, కులగణన సర్వే జరపాలని కూడా అనుకోవటం లేదన్నారు. ప్రభుత్వం తెచ్చిన మూడు బిల్లులు మహిళా, ఓబీసీ, రాజ్యాంగ, సమాఖ్య వ్యతిరేక బిల్లులని గౌరవ్‌ గొగోయ్‌ అభివర్ణించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. జనగణనను ఆలస్యం చేయటానికే మహిళాబిల్లులో కేంద్రం సవరణలు తీసుకొచ్చిందన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అంశానికి తమ పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిందని తెలిపారు. సోషలిస్టు నాయకులందరూ స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక న్యాయం అనే లక్ష్యాలకు కట్టుబడిన వారేనని గుర్తు చేశారు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎ్‌సఎ్‌సలో ఎంతమంది మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారని అఖిలేశ్‌ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు సీఎంలుగా ఉన్నారని, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎంతమంది మహిళలున్నారని నిలదీశారు.

Updated Date - Apr 17 , 2026 | 03:18 AM