Share News

మా అమ్మ వాస్తవాలు చెబితే అబద్ధాలంటారా..?

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:37 AM

కాంగ్రెస్‌ అగ్రనేత, తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ (‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’) పుస్తకంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎంపీ ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.

మా అమ్మ వాస్తవాలు చెబితే అబద్ధాలంటారా..?

  • బీజేపీ, ఆర్‌ఎస్ఎస్సే తప్పుడు ప్రచారం చేశాయి: ప్రియాంక

వయనాడ్‌/తిరువనంతపురం, నవంబరు 12: కాంగ్రెస్‌ అగ్రనేత, తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ (‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’) పుస్తకంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎంపీ ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. తన తల్లిపై బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ చాలా ఏళ్లుగా తప్పుడు ప్రచారాలు చేశాయని.. ఇప్పుడు ఆమె ఓ పుస్తకం ద్వారా తన అనుభవాలు, వాస్తవాలను వెల్లడిస్తుంటే వాటిని అబద్ధాలుగా చిత్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తన గురించి చెప్పుకొనే హక్కు ఆమెకు ఉందన్నారు. కేరళలోని వయనాడ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తన జీవితంలో ఎక్కువ కాలం భారత్‌లోనే గడిపిన మా అమ్మపై బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌, కొన్ని పార్టీలు అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేశాయి. ఇన్నాళ్లూ ఆమె మౌనంగానే ఉండిపోయారు. ఇప్పుడు ఆమె నిజం చెబుతున్నారు. ఏదేమైనా వాళ్లు కూడా ఆమె పుస్తకాన్ని చదువుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. కాగా, సోనియా ఆత్మకథ పుస్తకం ఓ అసత్యాల పుట్ట అని.. అందులో అన్నీ అబద్ధాలే ఉన్నాయని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు, బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ విమర్శించారు.

Updated Date - Nov 13 , 2026 | 02:38 AM