Share News

సహనానికి దక్కిన విజయం!

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:47 AM

అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్‌ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు...

సహనానికి దక్కిన విజయం!

  • అమెరికా సుంకాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం

  • దాని ఫలితాలను మీరిప్పుడు చూస్తున్నారు

  • అమెరికా సుంకాల తగ్గింపుపై ప్రధాని

  • ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ప్రకటన: కేంద్ర మంత్రి గోయల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్‌ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అనుకూలమైన ఆర్థిక వాతావరణం ఏర్పడిందని, భారత్‌లో ప్రతి ఒక్కరూ దీనితో ప్రయోజనం పొందుతారని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ సందర్భంగా మోదీ ఈ అంశంపై మాట్లాడారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా పెద్ద నిర్ణయమన్నారు. అమెరికా టారి్‌ఫలపై ప్రతిపక్షం ఎంతగా విమర్శలు చేసినా, తాము ఎంతో సహనంతో వ్యవహరించామని.. ఆ సహనంతో వచ్చిన ప్రతిఫలమేమిటో ఇప్పుడు అందరికీ కనిపిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి వాణిజ్య చర్చల విషయంలో ప్రభుత్వ స్థిరమైన వైఖరి దీనితో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కానీ భారత్‌ మాత్రం ప్రయోజనం పొందుతోందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల క్రమం మారుతోందని, ఆ మార్పు భారత్‌వైపు మొగ్గుతోందని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నేతలు తొలుత ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సత్కరించారు. అమెరికా, ఈయూ, యూకే, ఒమన్‌ సహా 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాల ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

ఒప్పందం తుదిదశలో ఉంది: గోయల్‌

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం ఇంకా తుదిదశలో ఉందని, ఒప్పందానికి తుదిరూపు వచ్చాక భారత్‌, యూఎస్‌ సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌ చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ చర్చలు, ఎన్నో తర్జనభర్జనల తర్వాత అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఇతర దేశాలకన్నా కూడా మంచి ఒప్పందం కుదురుతోందని.. మన దేశ వ్యవసాయ, పాడి పరిశ్రమ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పారు. ప్రధాని మోదీ, ట్రంప్‌ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం కారణంగానే అమెరికాతో మంచి ఒప్పందం జరుగుతోందని.. భారత్‌పై సుంకాలు 50శాతం నుంచి 18శాతానికి తగ్గుతున్నాయని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ఈ డీల్‌ విషయంలో దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, రాహుల్‌ గాంధీది తిరోగమన మనస్తత్వమని ఆయన మండిపడ్డారు. ట్రంప్‌ సుంకాల తగ్గింపు నిర్ణయం భారత్‌కు ఎంతో అనుకూలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు.


‘సున్నా’ టారి్‌ఫపై ఆందోళన

ఇక అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారత్‌ సున్నాకు తగ్గించడానికి అంగీకరించిందన్న ట్రంప్‌ ప్రకటనపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే అమెరికా చవక ఉత్పత్తులు స్థానిక మార్కెట్లను ముంచెత్తి.. స్థానిక రైతులు, వ్యాపారులకు తీవ్ర నష్టం తప్పదనే కలకలం రేగుతోంది. ఈ ‘జీరో’ టారిఫ్‌ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదు. వాణిజ్య ఒప్పందం వివరాలను ప్రకటించినప్పుడు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

భారత్‌ అలాంటి సమాచారమేమీ ఇవ్వలేదు: రష్యా

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్‌ అంగీకరించిందని ట్రంప్‌ పేర్కొనడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పందించారు. భారత్‌తో రష్యా సంబంధాలు, చమురు కొనుగోళ్లపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని మంగళవారం వెల్లడించారు. చమురు కొనుగోలు ఆపేస్తామన్న దిశగా భారత్‌ నుంచి రష్యాకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను తాము గౌరవిస్తామని.. కానీ భారత్‌-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే రష్యా సంస్థలకు ఇచ్చిన ఆర్డర్ల మేరకు చమురు కొనుగోళ్లు ఉంటాయని.. కొత్తగా ఆర్డర్లు ఉండబోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం అమెరికా ఆంక్షలు విధించిన సమయంలోనే ఐఓసీ, బీపీసీఎల్‌ మినహా మిగతా ప్రభుత్వ రంగ రిఫైనరీలు రష్యా చమురు దిగుమతులను నిలిపివేశాయని, రిలయన్స్‌ కూడా దిగుమతులను తగ్గించిందని వెల్లడించాయి. ఇప్పుడీ సంస్థలూ కొనుగోలు ఆపేస్తాయని, రష్యా చమురు సంస్థలకు వాటా ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీ మాత్రం ఆ దేశ చమురు కొనుగోలు కొనసాగించే అవకాశం ఉందని తెలిపాయి.

Updated Date - Feb 04 , 2026 | 06:14 AM