Share News

Prime Minister Modi: విభజన శక్తులను తరిమేద్దాం!

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:01 AM

సోమనాథ్‌ ఆలయ చరిత్రను తుడిచివేసేందుకు గత ప్రభుత్వాలు చాలా హేయమైన ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని..

Prime Minister Modi: విభజన శక్తులను తరిమేద్దాం!

  • సోమనాథ్‌ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం

  • ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు

  • అవి విద్వేష దాడులన్న సంగతి దాచిపెట్టారు

  • పునర్నిర్మాణంలో పటేల్‌ను అడ్డుకునే యత్నం

  • ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి

  • రాజేంద్రప్రసాద్‌ వస్తానంటే అభ్యంతరాలు

  • సోమనాథ్‌ ‘శౌర్యయాత్ర’లో మోదీ ధ్వజం

సోమనాథ్‌, జనవరి 11: సోమనాథ్‌ ఆలయ చరిత్రను తుడిచివేసేందుకు గత ప్రభుత్వాలు చాలా హేయమైన ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని.. అలాంటి విభజన, బుజ్జగింపు శక్తులను మనమంతా ఐక్యంగా, దృఢంగా ఉండి ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత కూడా బానిస మనస్తత్వంతో దాని వారసత్వాన్ని తక్కువ చేసేందుకు చూశారని ధ్వజమెత్తారు. సోమనాథ్‌ ఆలయంపై తొలిసారి విదేశీ దాడులు జరిగి వెయ్యేళ్లయిన సందర్భంగా శనివారం చేపట్టిన ‘సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌’లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. ఆదివారం అక్కడే ‘శౌర్యయాత్ర’లో పాలుపంచుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘దోచుకోవడానికే సోమనాథ్‌ ఆలయంపై దాడులు చేశారని మనకు బోధించారు. కానీ అవి విద్వేష దాడులన్న అసలు చరిత్రను తరాల తరబడి దాచిపెట్టారు. నిజంగా ధనం కోసం ఈ దురాక్రమణలు జరిగి ఉంటే వెయ్యేళ్ల కిందట జరిగిన మొదటి దాడితోనే ఆగిపోయేవి. కానీ సోమనాథ్‌ విగ్రహాన్ని నాశనం చేశారు. ఆలయ స్వరూపాన్నే సమూలంగా మార్చేందుకు ప్రయత్నించారు. దాడుల వెనుక ఉన్న విద్వేషం, అత్యాచారాలు, ఉన్మాదాన్ని దాచిపెట్టారు. మహ్మద్‌ గజనీ 1026లో మొదటి దాడిచేశాడు. ఆ తర్వాత 17, 18 శతాబ్దాల్లో ఔరంగజేబ్‌ వరకు దాడులు కొనసాగాయి. ఔరంగజేబ్‌, మహ్మద్‌ బేగ్దా ఈ ఆలయాన్ని మసీదుగా మార్చాలని చూశారు.


కానీ ప్రతి దాడి తర్వాత మాళ్వా రాణి శివభక్తులు (అహల్యాబాయ్‌ హోల్కర్‌ సహా) దానిని పునర్నిర్మించుకుంటూ వచ్చారు. ఇతరులను నాశనం చేయడం ద్వారా ముందుకెళ్లాలనుకునే నాగరికతలు తమంతట తామే నాశనమవుతాయి. స్వాతంత్ర్యానంతరం ఈ ఆలయ పునర్నిర్మాణం చేయకుండా సర్దార్‌ పటేల్‌ను అడ్డుకునే యత్నాలు జరిగాయి. దాని ప్రారంభోత్సవానికి వెళ్లాలని ప్రథమ రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్‌ నిర్ణయించినప్పుడు.. అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆలయ జాతీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం తెలియకుండా చేయడమే దీని ఉద్దేశం. సోమనాథ్‌ చరిత్ర కేవలం విధ్వంసానికే కాదు.. ధైర్యసాహసాలు, త్యాగాలకు సంబంధించింది కూడా. ఎన్ని సార్లు ధ్వంసం చేసినా.. అన్ని సార్లూ పునర్నిర్మాణం జరిగింది. భారతీయ ఆత్మను ఎవరూ ముక్కలు చేయలేరనడానికి సోమనాథ్‌ ఆలయం నిదర్శనంగా నిలబడింది’ అని తెలిపారు. ఆలయ ప్రాంగణం సమీపాన నెలకొల్పిన సర్దార్‌ పటేల్‌ విగ్రహానికి కూడా మోదీ నివాళులు అర్పించారు. మరోవైపు, ప్రధాని మోదీ ఆదివారం రాజ్‌కోట్‌లో పెట్టుబడిదారులతో వైబ్రంట్‌ గుజరాత్‌ ప్రాంతీయ సదస్సు(వీజీఆర్‌సీ) ప్రారంభించారు. ప్రపంచమంతటా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని.. భారత్‌లో మాత్రం అసాధార రీతిలో రాజకీయ సుస్థిరత, వృద్ధి కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

శోభాయమానంగా శౌర్యయాత్ర

గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 108 గుర్రాలతో శౌర్య యాత్ర శోభాయమానంగా సాగింది. గుర్రం నడిపే ప్రతి రౌతూ తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంటు, కాషాయ తలపాగా ధరించారు. శంఖ్‌ సర్కిల్‌ నుంచి వీర్‌ హమీర్‌జీ గోహిల్‌ సర్కిల్‌ వరకు కిలోమీటరు పొడవున భక్తులు, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలుజల్లుతూ ప్రధానికి స్వాగతం పలికారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తదితరులతో ప్రత్యేక వాహనంలో ఆయన ముందుకు సాగుతూ అభివాదం చేశారు. యువ రుషికుమారులు డమరుక నాదం చేస్తూ ఆయన వాహనం వెంబడే నడిచారు. ఆయన వారి నుంచి రెండు డమరుకాలు తీసుకుని తానూ వాయించడం విశేషం.

Updated Date - Jan 12 , 2026 | 06:02 AM