పత్రికా స్వేచ్ఛలో పాక్ పైచేయి!
ABN , Publish Date - May 03 , 2026 | 04:02 AM
పత్రికా స్వేచ్ఛలో పాకిస్థాన్.. భారత్‌ను స్వల్పంగా అధిగమించింది. మొత్తం 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్థ సర్వే నిర్వహించింది.
180 దేశాల్లో 157వ స్థానంలో భారత్.. 153లో పాక్
న్యూఢిల్లీ, మే 2: పత్రికా స్వేచ్ఛలో పాకిస్థాన్.. భారత్‌ను స్వల్పంగా అధిగమించింది. మొత్తం 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్థ సర్వే నిర్వహించింది. ఆదివారం(మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే ఫలితాలను ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ-2026’ పేరిట విడుదల చేసింది. దీనిలో భారత్ 157వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 153వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే భారత్ 6 స్థానాలు దిగజారిందని, పాక్ 4 స్థానాలు ఎగబాకిందని అయినప్పటికీ.. ఇరు దేశాల్లోనూ ఆశించిన మేరకు స్వేచ్ఛ లేదని సంస్థ పేర్కొంది. ఇక, పాలస్తీనాలో భారత్ కంటే కూడా మెరుగైన పత్రికా స్వేచ్ఛ ఉన్నట్టు తెలిపింది. అయితే, పాక్, పాలస్తీనాలో పత్రికా కార్యాలయాలను నడపడం కత్తిమీద సాముగా మారిందని వివరించింది. భారత్‌లో జాతీయ భద్రతా చట్టాలను ప్రయోగించడంతో జర్నలిస్టుల పనివాతావరణం ప్రభావితమవుతున్నట్టు సంస్థ తెలిపింది. ఈ జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియా, డెన్మార్క్, స్వీడన్ ఉన్నాయి.