Share News

దేశంలో పెట్రో బాంబ్‌!

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:44 AM

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ముడి చమురు, గ్యాస్‌ రవాణాపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ దేశంలో ప్రీమియం పెట్రోలు ధరలు పెరిగాయి...

దేశంలో పెట్రో బాంబ్‌!

  • ప్రీమియం పెట్రోల్‌ ధరలు రూ.2.35వరకు పెంపు

  • సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతథం

న్యూఢిల్లీ, మార్చి 20 : పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ముడి చమురు, గ్యాస్‌ రవాణాపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ దేశంలో ప్రీమియం పెట్రోలు ధరలు పెరిగాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లైన ఇండియన్‌ ఆయిల్‌, బీపీసీఎల్‌,హెచ్‌పీసీఎల్‌ సంస్థలు ప్రీమియం పెట్రోలు ధరలను ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2 నుంచి రూ.2.35 మేర పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. పెరిగిన ధరలను తక్షణమే అమలులోకి తెచ్చాయి. దీంతో బీపీసీఎల్‌కు చెందిన స్పీడ్‌, హెచ్‌పీసీఎల్‌ పవర్‌, ఐఓసీఎల్‌ ఎక్స్‌పీ95 పెట్రోల్‌ ధరలు లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 మేర పెరిగాయి. అయితే, సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మాత్రం ఆయా సంస్థలు యథాతథంగా ఉంచాయి. వాహన ఇంజన్‌ మరింత మెరుగ్గా పని చేసేందుకు, అధిక మైలేజీ కోసం ప్రీమియం పెట్రోల్‌ వాడుతుంటారు. ప్రీమియం పెట్రోల్‌ వినియోగదారుల్లో లగ్జరీ, స్పోర్ట్స్‌, హైపెర్ఫార్మెన్స్‌ కార్ల యజమానులు అధికంగా ఉంటారు. దీంతో పెరిగిన ధరల ప్రభావం సంపన్న వర్గాలపైనే అధికంగా ఉండనుంది. యుద్ధం నేపథ్యంలో ముడిచమురు బ్యారెల్‌ ధర 110 డాలర్లకు చేరడమే ప్రీమియం పెట్రోల్‌ ధరల పెంపునకు కారణంగా తెలుస్తోంది. మరోపక్క, ఐఓసీఎల్‌(ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఇండస్ట్రీయల్‌ డీజిల్‌ ధరను లీటరుకు రూ.22 మేర పెంచింది. దీంతో రూ.87.67గా ఉన్న లీటరు ఇండస్ట్రీయల్‌ డీజిల్‌ ధర రూ.105.59కు చేరింది.

Updated Date - Mar 21 , 2026 | 03:44 AM