Geographical Indication: పొందూరు ఖద్దరుకు ‘జీఐ’ ట్యాగ్ వచ్చేసింది!
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:09 AM
శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దరుకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ వచ్చింది. ఖాదీ గ్రామోద్యోగ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్‌కుమార్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు.
న్యూఢిల్లీ, జనవరి 16: శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దరుకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ వచ్చింది. ఖాదీ గ్రామోద్యోగ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్‌కుమార్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు. ఖాదీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి ఫలితంగానే ఈ గౌరవం లభించిందని.. ఇది ఖాదీ రంగానికే గర్వకారణమని తెలిపారు. జీఐ ట్యాగ్‌తో అరుదైన ఈ చేనేత వస్త్రాలకు అధికారిక గుర్తింపు లభిస్తుందని.. అంతేగాక తరతరాలుగా ఈ చేతివృత్తిని కాపాడుకుంటూ వస్తున్న కళాకారుల శ్రమను గౌరవించినట్లవుతుందని చెప్పారు. ఈ ఖద్దరు వస్త్రాలను నేస్తున్న చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపవుతుందని.. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. నకిలీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా రక్షణ లభిస్తుందని.. అధికారిక, అసలైన ఉత్పత్తులు ప్రజలకు చేరతాయన్నారు.