Share News

ఉచితాలు అవినీతే!

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:34 AM

ఎన్నికల ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు.. రాజకీయ పార్టీలకు అందే విరాళాలను వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలని స్వచ్ఛంద సంస్థ ...

ఉచితాలు అవినీతే!

  • పార్టీలను ఆర్‌టీఐ పరిధిలోకి తేవాలి: ఏడీఆర్‌

న్యూఢిల్లీ, మార్చి 13: ఎన్నికల ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు.. రాజకీయ పార్టీలకు అందే విరాళాలను వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలని స్వచ్ఛంద సంస్థ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) స్పష్టం చేసింది. పార్టీల నియంత్రణకు చట్టం చేయాలని, వాటిని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) ప్రకారం.. తాయిలాలు, ఉచిత పథకాలను ఎరచూపడాన్ని అవినీతి పద్ధతులుగానే పరిగణించాలని తన తాజా నివేదికలో పేర్కొంది. ధనప్రభావాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘాని(ఈసీ)కి బలమైన అధికారాలు అప్పగించాలని ప్రతిపాదించింది. వ్యవస్థాగత బలహీనతల వల్ల ఆర్థిక పారదర్శకతకు పార్టీలు పాతరేస్తున్నాయని.. ప్రచార వ్యయానికి లెక్కలు చూపించడం లేదని ఆక్షేపించింది. విరాళాలు వెల్లడించని, కోర్టు ఆదేశాలు పాటించని పార్టీల గుర్తింపు రద్దుచేసే అధికారాన్ని ఈసీకి ఇవ్వాలని సిఫారసు చేసింది. ‘పార్టీలకు ప్రైవేటు విరాళాలపై పరిమితులు విధించాలి. విరాళాలిచ్చిన దాతలు, ఎన్నికల ట్రస్టుల వెనుక ఉన్న మాతృ సంస్థల వివరాలు తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. అజ్ఞాత, నగదు విరాళాలను నిషేధించాలి. రాజకీయ విరాళాలు డిజిటల్‌ లావాదేవీల ద్వారానే అందించాలి. పార్టీల పద్దులను కాగ్‌ ద్వారా స్వతంత్ర ఆడిటింగ్‌ జరపాలి. ఆడిట్‌ నివేదికలను తప్పనిసరిగా బహిరంగపరచాలి. ప్రైవేటు విరాళాలపై ఆధారపడడాన్ని తగ్గించాలి. ఇందుకోసం ఎన్నికల వ్యయం ప్రభుత్వమే భరించాలి. ఎన్నికల్లో మహిళలను ప్రోత్సహించే పార్టీలకు రాయితీలివ్వాలి. ధనబలం దుర్వినియోగమయ్యే నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయడం లేదా రద్దుచేసే చట్టబద్ధమైన అధికారాన్ని ఈసీకి కల్పించాలి’ అని ఏడీఆర్‌ పేర్కొంది.

Updated Date - Mar 14 , 2026 | 04:34 AM