స్వామి అవిముక్తేశ్వరానందపై పోక్సో కేసు నమోదు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:35 AM
బాలురను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో స్వామి అవిముక్తేశ్వరానందపై ప్రయాగ్‌రాజ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఇద్దరు బాలురను లైంగికంగా వేధించినట్టు ఆరోపణ
లఖ్‌నవూ, ఫిబ్రవరి 22: బాలురను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో స్వామి అవిముక్తేశ్వరానందపై ప్రయాగ్‌రాజ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆయన శిష్యుడు ముకుందానంద బ్రహ్మచారి, మరో ఇద్దరు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపైనా ఇదే కేసు పెట్టారు. ఒక మైనర్ సహా ఇద్దరు బాలురపై గత ఏడాదిగా లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాఘమేళా ఉత్సవంలోనూ లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఝున్సీ పోలీసు స్టేషన్ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. స్వామి రామభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్, మరికొందరు చేసిన ఫిర్యాదు మేరకు పోక్సో కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది. గురుసేవ పేరుతో గురుకులంలోను, మాఘమేళాలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ ఇది తప్పుడు కేసని, బాధ్యులకు శిక్ష పడాలని అన్నారు.