పీఎన్‌బీ కస్టమర్ల ఖాతాల నుంచి 35 కోట్లు మాయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:46 AM
వారు బ్యాంకుకు వెళ్లిందీ లేదు.. చెక్కులు, విత్‌డ్రాయల్ ఫారాలు, ఏ పత్రాలపై సంతకాలు చేసి పంపిందీ లేదు.
గ్రేటర్ నోయిడా బ్రాంచ్‌లో ఘటన..
మేనేజర్ సహా ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్
గ్రేటర్ నోయిడా, అక్టోబరు 29: వారు బ్యాంకుకు వెళ్లిందీ లేదు.. చెక్కులు, విత్‌డ్రాయల్ ఫారాలు, ఏ పత్రాలపై సంతకాలు చేసి పంపిందీ లేదు. కనీసం లావాదేవీల మెస్సేజ్‌లు, ఓటీపీలూ వారి ఫోన్లకు రాలేదు.. అయినా ఫిక్స్‌డ్ డిపాజిట్లు సహా పొదుపు ఖాతాల్లోని కోట్లాది రూపాయల సొమ్ము మాయమైంది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖాతాదారులకు చెందిన రూ.35 కోట్ల మేర సొమ్ము మాయమైంది. కొందరు ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే వారంతా బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. తమ డబ్బు తమకు చెల్లించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇటు బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. ఆ బ్రాంచ్ మేనేజర్ సహా ఐదుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టారు. అయితే జరిగిన మోసం రూ.35 కోట్లకే పరిమితమా.. లేక ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయా? అనేది దర్యాప్తు తర్వాతే స్పష్టత రానుంది.