‘సేవాతీర్థ్’లోకి పీఎంవో
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:48 AM
దేశ రాజధాని చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 95 ఏళ్లపాటు ఒకే భవనంలో కొనసాగిన ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తొలిసారి కొత్త చిరునామా పొందింది.
ప్రధాని కార్యాలయానికి కొత్త చిరునామా
‘న్యూఢిల్లీ’ ఏర్పడిన రోజే నాంది
కొత్త భవనాలను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : దేశ రాజధాని చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 95 ఏళ్లపాటు ఒకే భవనంలో కొనసాగిన ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తొలిసారి కొత్త చిరునామా పొందింది. కొత్త భవనం ‘సేవాతీర్థ్’లోకి శుక్రవారం లాంఛనంగా మారింది. ఆధునిక రాఽజధాని నగరంగా న్యూఢిల్లీ ఏర్పడిన రోజే ఈ అపూర్వ ఘటన చోటుచేసుకోవడం విశేషం. పీఎం రాహత్, లఖ్‌పతి దీదీలు, రైతులు, స్టార్టప్‌లకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడం ద్వారా ప్రధాని మోదీ శుక్రవారం కొత్త కార్యాలయం నుంచి పాలనను ప్రారంభించారు. ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి పీఎంవో విధులు నిర్వహించింది. 95 ఏళ్ల క్రితం, 1931 ఫిబ్రవరి 13వ తేదీన న్యూఢిల్లీ నగరం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. పాలనా అవసరాల కోసం అప్పుడు నిర్మించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్‌ల్లోనే పీఎంవో, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు పనిచేయడం మొదలుపెట్టాయి. 1947లో దేశ స్వాతంత్య్రం సిద్ధించింది. ఆ తర్వాత మూడేళ్లకు, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అరుదైన ఈ ఘట్టాలకు మౌన చారిత్రక సాక్షిగా నిలిచిన రైసినా హిల్స్ కాంప్లెక్స్ పక్కనే ‘సేవాతీర్థ్’ను నెలకొల్పారు. పీఎంవో, జాతీయ భద్రతా మండలి సచివాలయం, క్యాబినెట్ సచివాలయం ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగాయి. వాటిని ఇప్పుడు ఒకే గొడుగు కిందకు తెచ్చారు. సెంట్రల్ విస్టా పథకంలో భాగంగా ఈ మూడు విభాగాలూ ఇకపై ఒకే భవన సముదాయంలో పని చేయనున్నాయి. కొత్త భవన ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.వంద నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. ‘‘‘ఇండియా ఫస్ట్’ లక్ష్యంగా మరింత గౌరవ, వినమ్రతలతో దేశ ప్రజలకు కొత్త కార్యాలయం నుంచి సేవలు అందిస్తాం. కర్తవ్య నిర్వహణ, సేనా తత్పరత, సంకల్పాలకు ఉజ్వల ప్రతీకగా ‘సేవాతీర్థ్’గా ఉంటుంది’’ అన్నారు.
మరికొన్ని కొత్త కార్యాలయాలూ...
పలు కీలక మంత్రిత్వ శాఖల కోసం కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్-1,2 కార్యాలయాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రైసినా హిల్స్ కాంప్లెక్స్‌కు సమీపంలోనే వీటినీ ఏర్పాటుచేశారు. న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయం తదితర శాఖలు ఇకపై ఇక్కడినుంచి పని చేయనున్నాయి. కీలక మంత్రిత్వ శాఖలు ఇప్పటివరకు సౌత్, నార్త్ బ్లాకుల్లో విధులు నిర్వహించాయి. నార్త్ బ్లాక్‌లో హోంశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటే; సౌత్ బ్లాక్‌లో పీఎంవోతో పాటు రక్షణ శాఖ కార్యాలయాలు ఉండేవి. కాగా, ‘సేవాతీర్థ్’లో పాలనను ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేయడం ద్వారా ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. నారీ శక్తిలో భాగంగా.. లఖ్‌పతి దీదీల సంఖ్యను రెట్టింపు చేస్తూ, ఆరు కోట్ల మందిని లక్షాధికారులను చేసే ఫైల్‌పై ప్రధాని సంతకం చేశారు. అలాగే, వ్యవసాయ మౌలిక వసతుల నిధి పరిధిని రూ.లక్ష కోట్ల నుంచి రూ.2లక్షల కోట్లకు విస్తరించారు. కాగా, పీఎంవో సహా కీలక శాఖల కార్యాలయాల తరలింపుతో ఖాళీ అయిన సౌత్, నార్త్ బ్లాక్ భవనాలను జాతీయ మ్యూజియం కోసం కేటాయించనున్నారు.
‘పీఎం రాహత్’పై ప్రధాని తొలి సంతకం
ప్రధాని తన నూతన కార్యాలయంలో ‘పీఎం రాహత్’ పథకాన్ని ఆమోదిస్తూ తొలి సంతకం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత చికిత్స ఈ పథకంతో అందుబాటులోకి రానుంది.ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి 7రోజుల్లోగా ఈ సేవలను పొందవచ్చు.