9.44 కోట్ల రైతులకు.. 18,880 కోట్లు
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:00 AM
దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం నిధులు విడుదలయ్యాయి.
పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల
బెంగాల్ నుంచి విడుదల చేసిన ప్రధాని మోదీ
కోల్‌కతా, జూన్ 20: దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం నిధులు విడుదలయ్యాయి. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పీఎం కిసాన్ 23వ విడత కింద మొత్తం రూ.18,880 కోట్లను ఒకేసారి విడుదల చేశారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) కింద ఏటా మూడు దఫాలుగా రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు రూ.4.46 లక్షల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. 23వ విడతలో బెంగాల్‌లో 45.35 లక్షలకు పైగా రైతులకు రూ.907 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజా నిధులను కలుపుకొని బెంగాల్‌కు ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.15,000 కోట్లు అందజేసినట్లు పేర్కొంది.