Share News

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:49 PM

నూతన ప్రధాన మంత్రి కార్యాలయం సేవా తీర్థ్‌‌‌ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థికసాయం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని కూడా ప్రారంభించారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని
Seva Teerth Bhavan inauguration

ఢిల్లీ: ప్రధాన మంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్‌ను ఇవాళ (శుక్రవారం) ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తొలి గంటలో వైద్య సాయం అందడం అత్యవసరం. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పిలుస్తారు. ఈ సమయంలో వైద్యం అందితే ప్రాణాపాయం చాలా వరకూ తగ్గిపోతుంది. ఇంతటి కీలక సమయంలో నిధుల కొరత కారణంగా వైద్యసేవల్లో జాప్యం జరగకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

పీఎం రాహత్ పథకంలో రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల మేర తక్షణ వైద్య సాయం అందుతుంది. కాబట్టి, ఆసుపత్రి వర్గాలు వెంటనే వైద్యం ప్రారంభించాల్సి ఉంటుంది. తమ వద్ద తగిన సౌకర్యాలు లేకపోతే ఆసుపత్రి యాజమాన్యం స్వయంగా అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి పంపించాలి. బాధితుడు డిశ్చార్జ్ అయ్యాక ఆసుపత్రి యాజమాన్యాలు సంబంధిత ప్యాకేజీల మేరకు బిల్లులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


ఇక గ్రామీణ మహిళల స్వావలంబన కోసం గతంలో ప్రారంభించిన లఖ్‌పతీ దీదీ పథకాన్ని కేంద్రం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్చయించింది. గ్రామీణ మహిళలు ఏటా సగటున రూ.లక్ష ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ దిశగా మహిళలకు పలు రంగాల్లో కేంద్రం శిక్షణ ఇస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే సుమారు 3 కోట్ల మంది మహిళలు తమ కుటుంబ సగటు ఆదాయాన్ని రూ.లక్షకు పెంచుకోగలిగారు. నిర్దేశిత సమయానికంటే ముందే ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ నేపథ్యంలో లఖ్‌పతీ దీదీల సంఖ్యను 2029 మార్చ్‌ నాటికి తొమ్మిది కోట్లకు చేర్చేలా కొత్త లక్ష్యాన్ని ప్రధాని నిర్దేశించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా

Updated Date - Feb 13 , 2026 | 08:20 PM