గ్యాస్ కొరతను అధిగమిస్తాం!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:43 AM
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతను అధిగమిస్తామన్నారు.
దేశ ప్రజలను కాపాడుకుంటాం: మోదీ
చెన్నై, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతను అధిగమిస్తామన్నారు. ఈ యుద్ధం అంతర్జాతీయంగా మొత్తం ఆహార గొలుసును ప్రభావితం చేసిందని, నిత్యావసర వస్తువుల సరఫరాపైనా ప్రభావం చూపిందని వివరించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని, దేశ ప్రజలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. యుద్ధం, తదనంతర పరిణామాల గురించి పుకార్లను నమ్మవద్దని, ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని సూచించారు. మనది ఎంత గొప్ప దేశమో కరోనా సమయంలో ప్రపంచానికి చాటిచెప్పామని, అదే విధంగా ఈ గడ్డు పరిస్థితిని కూడా విజయవంతంగా అధిగమిస్తామని తెలిపారు. బుధవారం తమిళనాడులోని తిరుచ్చికి విచ్చేసిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.5,600 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు ఐదు రైలు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఎన్‌డీఏ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు అంతం పలకాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్‌డీఏ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారని చెప్పారు. 2021లో రాష్ట్ర ప్రజలు డీఎంకేకు అధికారం కట్టబెట్టారని, అయినా ఆ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.