పరీక్షలు పండుగల్లాంటివి.. వాటిని ఉత్సవంలా జరుపుకోవాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:48 AM
అందరూ చెప్పే సలహాలు వినండి. వాటిలో మీకు సరిపోయేవి ఎంచుకోండి. మీకు నచ్చిన విధంగా మీ జీవనశైలిని మార్చుకోండి.
‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ‘‘అందరూ చెప్పే సలహాలు వినండి. వాటిలో మీకు సరిపోయేవి ఎంచుకోండి. మీకు నచ్చిన విధంగా మీ జీవనశైలిని మార్చుకోండి. చదువు ఒక భారంగా అనిపించకూడదు. కేవలం మార్కులపైనే కాకుండా జీవితాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి’’ అని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో శుక్రవారం నిర్వహించిన ‘ప్రధానితో పరీక్షా పే చర్చ-2026’ తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆయన వారితో సంభాషించారు. ఈ సందర్భంగా చిన్నారులకు మోదీ పలు సూచనలు చేశారు. పరీక్షలు పండుగల్లాంటివని, వాటిని ఉత్సవాల తరహాలో జరుపుకోవాలని చెప్పారు. ‘‘మనం ఎంచుకున్న లక్ష్యం చేరుకోగలిగేలా ఉండాలి. కానీ సులభంగా సాధించగలిగేదిగా ఉండకూడదు. ముందుగా పూర్తి ఏకాగ్రతతో మనసును అదుపులో పెట్టుకోండి. తర్వాత చదవాల్సిన అంశాలపై దృష్టి నిలిపితే విజయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది’’ అని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తన నివాసానికి వచ్చిన విద్యార్థుల బృందానికి మోదీ సూచించారు.