వేడి గాలులతో జాగ్రత్త
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:06 AM
దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్రమైన ఎండలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ...
‘మన్ కీ బాత్’లో మోదీ సూచన
న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్రమైన ఎండలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం, మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్‌లో మోదీ ప్రసంగిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు. తరుచూ నీళ్లు తాగుతూ ఉండాలని, ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను, పండ్ల గురించి ప్రధాని ప్రస్తావించారు. మామిడిపండ్ల గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మామిడి పండ్లు ప్రసిద్ధి చెందాయని, రుచి, సువాసనలో వేటికవే సాటి అని అన్నారు. దక్షిణ భారతదేశానికి వెళితే బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలుంటాయని, ఇటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సువర్ణరేఖ ఉన్నాయని చెప్పారు. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనలో తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను అప్పగించారని తెలిపారు. ఆ ఫలకాలు.. చోళుల విజయాలను, వారి సముద్ర శక్తిని, ఆగ్నేయాసియా దేశాలతో వారి సంబంధాలను వెల్లడిస్తాయని తెలిపారు.