జనగణనలో అంతా భాగస్వాములు అవ్వండి
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:10 AM
జనగణనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 133వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): జనగణనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 133వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం మన దేశంలో అత్యంత కీలకమైన ‘జనగణన-2027’ మహా యజ్ఞం జరుగుతోంది. ఈసారి జనగణనను పూర్తి డిజిటల్ రూపంలోకి మార్చాం. గణన కోసం మీ ఇంటికి వచ్చే సిబ్బంది తమ మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేస్తారు. అయితే, మీ సౌలభ్యం కోసం ఈసారి ‘స్వీయ గణన’ సదుపాయాన్ని కల్పించాం. సిబ్బంది వచ్చే 15 రోజుల ముందే మీరు స్వయంగా మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అలా పూర్తి చేసినప్పుడు లభించే ప్రత్యేక ఐడీ సంఖ్యను సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది. దీనివల్ల సమాచారాన్ని మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. జనగణన కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. మనందరి బాధ్యత. మీరు అందించే సమాచారం పూర్తి సురక్షితంగా, గోప్యంగా ఉంటుంది. మనమందరం కలిసి ఈ ప్రక్రియలో భాగస్వాములై ‘జనగణన-2027’ను దిగ్విజయం చేద్దాం.’’ అని మోదీ పిలుపునిచ్చారు.