18న కేంద్ర మంత్రులతో మోదీ కీలక భేటీ!
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:48 AM
పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ నెల 18న కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ సమావేశాల ఎజెండా, కీలక బిల్లులపై చర్చ
క్యాబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా..
న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ నెల 18న కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులకు ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందింది. అయితే సమావేశ ఎజెండా ఏమిటన్నది చెప్పలేదని.. కేవలం ప్రధాని మోదీతో విందు సమావేశమని మాత్రమే సమాచారం ఇచ్చారని తెలిసింది. పేరుకు ఇది విందు సమావేశమని చెబుతున్నా.. కీలక అంశాలపై చర్చిం చే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సో మవారం మనీలాకు వెళ్లనున్నారు. అక్కడినుంచి 18న తిరిగి రాగానే మంత్రులతో భేటీ జరగనుంది. ఈ నెలాఖరులో పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం కేంద్ర క్యాబినెట్‌లో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం మంత్రివర్గంలో 29 మంది క్యాబినెట్ హోదా, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 34 మంది సహాయ మంత్రులు కలిపి.. 68 మంది ఉన్నారు. నిజానికి కేంద్ర మంత్రివర్గంలో ఎప్పుడూ సుమారు 75 మంది మంత్రులు ఉంటుంటారు. ఇక క్యాబినెట్ హోదా మంత్రుల్లో 12 మంది ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదనంగా ఉన్న శాఖలను వారి నుంచి తొలగించి, కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
ప్రత్యేక సమావేశాలా? శీతాకాల సమావేశాలా?
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. నిజానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి దాదాపుగా 96 రోజులు అవుతున్నా ఇప్పటికీ ప్రోరోగ్ చేయలేదు. ఈనెల 20 తర్వాత మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. తర్వాత 30వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు చేపట్టాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం.