Share News

బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు థాంక్స్‌

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:04 AM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి.. దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించుకున్న....

బంగారం కొనుగోళ్లు  తగ్గించినందుకు థాంక్స్‌

  • పశ్చిమాసియా సంక్షోభ సమయంలో.. ప్రజలు నా విజ్ఞప్తులను మన్నించారు

  • దేశ ప్రజల ఈ ఐక్యతే భారత్‌ బలం.. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి)/విక్టోరియా(సీషెల్స్‌): పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి.. దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించుకున్న ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మన్‌ కీ బాత్‌’ 135వ ఎపిసోడ్‌లో భాగంగా ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వివాహాలు వంటి వేడుకల్లో కూడా బంగారం కొనకుండా ప్రజలు పాత బంగారాన్నే పునర్వినియోగిస్తూ దేశభక్తిని చాటుతున్నారంటూ కొనియాడారు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, కార్‌ పూలింగ్‌, మెట్రో ప్రయాణాల ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడం, రైతులు రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని అవలంబించడం వంటి ప్రజా భాగస్వామ్య శక్తే అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో భారతదేశాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో జూన్‌ నెలలో సాధించిన విజయాలు ప్రతి పౌరుడికీ గర్వకారణమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, అహ్మదాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్’లో 102 స్వర్ణాలు సహా 114 పతకాలు సాధించి భారత్‌ అగ్రస్థానంలో నిలవడంపై క్రీడాకారులను ప్రధాని అభినందించారు. హిందూ మహా సముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే లక్ష్యంగా సీషెల్స్‌తో కలిసి పని చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్‌ వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మీనీ, ఉన్నతాధికారులతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆదివారం ఉదయం చర్చించారు. అనంతరం ఓ ప్రత్యేక కార్యక్రమంలో సీషెల్స్‌ ప్రభుత్వం ప్రధాని మోదీకి ‘‘గార్డియన్‌ ఆఫ్‌ ద బ్లూ హారిజన్‌’’ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాలకు ప్రధాని మోదీ అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా సీషెల్స్‌ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ ఆ పురస్కారాన్ని అందజేశారు.

Updated Date - Jun 29 , 2026 | 05:04 AM