దేశం సంక్షోభంలో ఉంటే విపక్షాలకు సంతోషం
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:26 AM
దేశం సంక్షోభంలో ఉంటే విపక్షాలు సంతోషిస్తాయంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భిల్దీ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం..
నా ప్రతిష్ఠ దిగజార్చడమే లక్ష్యంగా దేశంలో గందరగోళానికి ప్రయత్నాలు
చివరి శ్వాస వరకు దేశ సేవలోనే మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 30: దేశం సంక్షోభంలో ఉంటే విపక్షాలు సంతోషిస్తాయంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భిల్దీ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. నవంబరు 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో విపక్షాలు తలపెట్టిన ధర్నా, ‘మోదీకా బాప్బీ జాయేగా (మోదీ తండ్రి కూడా వెళ్లాల్సిందే) అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. చివరి శ్వాస వరకు దేశ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్న సమయంలో, దేశంలోని రైతులు, మహిళల్లో భయాందోళనలను వ్యాప్తి చేస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహించారు. ‘‘దేశం బాధలు పడుతుంటే వారికి బాగుంటుంది. దేశ సంకట స్థితి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది’’ అంటూ మోదీ మండిపడ్డారు. దేశ ఇంధన భద్రతతోపాటు క్రిమి సంహారకాల దిగుమతిపై గల్ఫ్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గడ్డుపరిస్థితిని దేశం ఒక్కతాటిపైకి వచ్చి ఎదుర్కొంటుండగా, ఎరువుల కొరత గురించి కొంతమంది తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. దొంగ క్యూలైన్లు వారే సృష్టించి రైతుల్లో భయాందోళనలు వ్యాప్తి చేశారన్నారు.
దేశంలో గందరగోళం సృష్టించడం ద్వారా తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గల్ఫ్ ఉద్రిక్తతలు మొదలైన కొత్తల్లో, ఇందుకు విఫల ప్రయత్నం చేశాయన్నారు. ‘‘గ్యాస్ దొరికే పరిస్థితి ఇక లేదు...వంట ఎలా చేసుకుంటారు.. సకాలంలో పిల్లలను బడులకు ఎలా పంపిస్తారంటూ గృహిణులను భయపెట్టారని, ఎరువులపై రైతులను ఆందోళనకు గురిచేశారన్నారు. ‘‘రైతులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చా. మాట ఇచ్చినట్టే యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఎక్కడా ఎరువులకు కొరత రానీయలేదు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, రసాయనాల ధరలు పెరిగినప్పటికీ ఆ భారం రైతులపై పడకుండా చూశామన్నారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3 వేలు ఉన్న బస్తా యూరియాను, మనం ఇక్కడ రూ.300 కన్నా తక్కువకే ఇస్తున్నాం. రూ. 5000 ఉన్న డీఏపీని మన రైతులు రూ.1,350కే అందుకుంటున్నారు. వివిధ పథకాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా రైతాంగం రూ.ఐదు లక్షల కోట్ల మేర లబ్ధి పొందింది.’’ అని వివరించారు. గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష సంఘ్వీ మాట్లాడుతూ.. ‘మోదీ కహీ నహీ జాయేగా’ (మోదీ ఎక్కడకూ వెళ్లరు) అంటూ నినదించారు. ఆ వెంటనే సభలోని వారంతా దాన్ని అందుకుని.. పెద్ద ఎత్తున నినదించారు.
రైతుల ఖాతాల్లో నగదు జమ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడతలో భాగంగా రూ. 18,000 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రధాని మోదీ జమ చేశారు. దేశవ్యాప్తంగా 10 కోట్లమంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూర్చింది. ఇందులో గుజరాత్‌కు చెందిన యాభై లక్షలమంది వెయ్యి కోట్ల విలువైన ప్రయోజనం పొందారు.