సముద్ర రంగంలో నిర్ణాయక శక్తిగా భారత్!
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:55 AM
సముద్ర రంగంలో పట్టు సాధించకుండా ఏ దేశమూ గొప్ప శక్తిగా ఎదగలేదని... అభివృద్ధి, సంపద, భద్రత అన్నీ సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అభివృద్ధి, సంపద, భద్రత.. సముద్రాలతోనే సాధ్యం
భవిష్యత్తులో లక్షలాది మందికి ఉపాధి
దునగిరి, సంశోధక్, అగ్రయ్ ప్రారంభంలో ప్రధాని మోదీ
కోల్‌కతా, పుణె, జూలై 21: సముద్ర రంగంలో పట్టు సాధించకుండా ఏ దేశమూ గొప్ప శక్తిగా ఎదగలేదని... అభివృద్ధి, సంపద, భద్రత అన్నీ సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ కూడా కేవలం రక్షణ పరికరాలు కొనుగోలు చేసే దేశంగానే మిగిలిపోకుండా.. వాటిని ఉత్పత్తి చేసే దేశంగా ఎదుగుతోందని చెప్పారు. తద్వారా రానున్న కాలంలో సముద్ర రంగంలో ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే శక్తిగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లలో 40కి పైగా యుద్ధ, సర్వే నౌకలు, జలాంతర్గాములు భారత నౌకాదళంలో చేరాయని.. మరో 45 నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్‌ఎస్ దునగిరి’, సర్వే నౌక ‘ఐఎన్‌ఎస్ సంశోధక్’, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ అగ్రయ్’ అనే మూడు నౌకలను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సముద్ర రంగం రానున్న రోజుల్లో దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంప్లాయ్‌మెంట్ ఇంజిన్‌గా మారనుందని చెప్పారు. భవిష్యత్తులో సముద్ర రంగంలో భారత్ ప్రపంచస్థాయి నిర్ణయకర్తగా మారుతుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మూడు యుద్ధ నౌకల చేరికతో నౌకాదళ బలం మరింత పెరగనుంది.
ఐఎన్‌ఎస్ దునగిరి
ప్రధాని మోదీ ప్రారంభించిన మూడు నౌకల్లో ఐఎన్‌ఎస్ దునగిరి పెద్దది. ఇదొక స్టెల్త్ ఫ్రిగేట్ నౌక. శత్రువుల రాడార్లు, సెన్సర్లకు చిక్కకుండా అధునాతన టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. తీరానికి చాలా దూరంలో పనిచేసేలా దీన్ని తయారు చేశారు. నేవీలో విశిష్ట సేవలందించిన ఐఎన్‌ఎస్ నీలగిరి శ్రేణిగా ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా దునగిరిని ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు. దీనిలో బ్రహ్మోస్ క్షిపణులతోపాటు మధ్యశ్రేణి మిస్సైల్స్ వంటి ఆయుధాలు, మల్టీ ఫంక్షన్ సర్వైలెన్స్, ట్రాక్ అండ్ గైడెన్స్ రాడార్, సోనార్, సెన్సర్లు, ఎలకా్ట్రనిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలు ఉన్నాయి. 149 మీటర్ల పొడవు, 6,670 టన్నుల బరువుండే ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల (52 కి.మీ.) వేగంలో ప్రయాణించగలదు.
ఐఎన్‌ఎస్ సంశోధక్
భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా నిర్మించిన అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక ఐఎన్‌ఎస్ సంశోధక్. సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేయడానికి, మహాసముద్రాల లోతును కొలవడానికి, కొత్త సముద్ర మార్గాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఇది 110 మీటర్ల పొడవు, 3400 టన్నుల బరువు ఉంటుంది. గంటకు 33 కి.మీ. (18 నాటికల్ మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నౌక ద్వారా రక్షణ, పౌర అవసరాల కోసం విలువైన సముద్రగర్భ సమాచారాన్ని సేకరించవచ్చు. నీటి అడుగున మ్యాపింగ్ చేయడానికి, దూర ప్రాంతాల సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడే అటానమస్ అండర్ వాటర్ వెహికిల్స్ (ఏయూవీ) దీనిలో ఉన్నాయి. అలాగే మానవ ప్రమేయం లేకుండా నీటి అడుగున పరిశోధనలు చేయడానికి వీలుగా రిమోట్‌తో నడిచే యంత్రాలు కూడా ఉన్నాయి.
ఐఎన్‌ఎస్ అగ్రయ్
ఐఎన్‌ఎస్ దునగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్‌తో పోలిస్తే అగ్రయ్ చిన్న నౌక అయినప్పటికీ.. అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొక జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం, అధునాతన తేలికపాటి టార్పెడోలు లేదా రాకెట్ల ద్వారా వాటిని ధ్వంసం చేయడం దీని విధి. దీనిలో నిస్సార జలాల్లో పనిచేయగల అత్యంత శక్తివంతమైన షాలో వాటర్ సోనార్ వ్యవస్థ ఉంది.