Share News

బంగారం కొనద్దని... నేను చెప్పాను.. ప్రజలు విన్నారు

ABN , Publish Date - Nov 22 , 2026 | 03:04 AM

బంగారం కొనుగోళ్ల అంశంలో తాను ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్పందించారంటూ ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తన పిలుపు మేరకు ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారని..

బంగారం కొనద్దని... నేను చెప్పాను.. ప్రజలు విన్నారు

  • ధరలు దిగొచ్చి వాళ్లే లబ్ధి పొందారు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 21: బంగారం కొనుగోళ్ల అంశంలో తాను ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్పందించారంటూ ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తన పిలుపు మేరకు ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారని, బంగారం ధరలు దిగివచ్చి ప్రజలు లబ్ధి పొందారని అన్నారు. గతంలో భోజనం విషయంలో మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు ఇప్పటికీ అదే నిబద్ధతతో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. లఖ్‌నవూ వేదికగా శనివారం జరిగిన నేషనల్‌ కౌషల్‌ దీక్షాంత్‌ సమారోహ్(నైపుణ్య స్నాతకోత్సవం)లో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ అవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ఏడాది క్రితం ప్రజలకు పిలుపునిచ్చా. రోజులో ఓ పూట భోజనాన్ని త్యాగం చేయాలని గతంలో మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన పిలుపునకు స్పందించిన విధంగానే ఇప్పుడు కూడా ప్రజలు నా మాట పాటించడం ఆనందంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ దేశ ప్రజల స్వభావంలో ఎలాంటి మార్పు లేదు. నాలాంటి ఓ మామూలు వ్యక్తి చేసిన వినతికి స్పందించిన ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారు. ఇప్పుడు ధరలు పతనమయ్యాయి. ‘మోదీ గారు మీ మాట విన్నాం, మా డబ్బు ఆదా చేశారు’ అని ప్రజలు నాతో చెబుతున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 03:13 AM