Share News

ప్రజా సేవే దేశ సేవ!

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:28 AM

దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా మార్చే ప్రయాణంలో యువతదే కీలక పాత్ర అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు సమర్థత..

ప్రజా సేవే దేశ సేవ!

  • ‘పౌరులే ఫస్ట్‌’ అనే దృక్పథం అవసరం

  • సమర్థత, నిజాయితీతో వ్యవహరించాలి

  • ప్రజాసంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి

  • కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి ప్రధాని మోదీ సూచన

  • 20వ రోజ్‌గార్‌ మేళాలో 51 వేల మందికి నియామక పత్రాలు అందజేత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా మార్చే ప్రయాణంలో యువతదే కీలక పాత్ర అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు సమర్థత, నిజాయితీతో ప్రజలకు సేవలందించాలని, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని ఉద్భోదించారు. ప్రజా సేవను దేశ సేవగా భావించాలని, పౌరులకు ప్రాధాన్యతనిచ్చే దృక్పథం (సిటిజన్‌ ఫస్ట్‌ అప్రోచ్‌)తో విధులు నిర్వర్తించాలని కోరారు. శనివారం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన 20వ రోజ్‌గార్‌ మేళాలో 51వేల మందికిపైగా యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకపత్రాలు అందుకున్నారు. రెవెన్యూ, ఆర్థిక, రైల్వే, హోం, ఆరోగ్యం తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వీరు సేవలందించనున్నారు. రోజ్‌గార్‌ మేళా ద్వారా ఇప్పటి వరకూ ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య సుమారు 12.75 లక్షలకు చేరింది. నియామకపత్రాల అందజేత కార్యక్రమానికి ప్రధాని వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు. ఈ విజయానికి అభ్యర్థుల కఠోర శ్రమతో పాటు వారి కుటుంబాల త్యాగాలు కూడా కారణమని పేర్కొన్నారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడంతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ విద్యా విధానం, స్కిల్‌ ఇండియా, పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన వంటి కార్యక్రమాలను ఉదహరించారు. ‘పీఎం సేతు’ కార్యక్రమాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి, పెట్టుబడుల్లో సుమారు 12 శాతం పెరుగుదల ఆర్థిక పురోగతికి సంకేతాలని ప్రధాని పేర్కొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 06:29 AM