Share News

గంగోత్రి నుంచి.. గంగాసాగర్‌ వరకు

ABN , Publish Date - May 05 , 2026 | 06:00 AM

దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు ప్రతిచోటా కమలం వికసిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజకీయ పార్టీలు ప్రతీకారం కోసం కాకుండా మార్పు కోసం పనిచేయాలని సూచించారు.

గంగోత్రి నుంచి..  గంగాసాగర్‌ వరకు

  • ప్రతిచోటా కమలం వికసిస్తోంది

  • బెంగాల్‌ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి

  • తమిళనాడు, కేరళలో గెలిచిన పార్టీలకు అభినందనలు.. ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, మే 4: దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు ప్రతిచోటా కమలం వికసిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజకీయ పార్టీలు ప్రతీకారం కోసం కాకుండా మార్పు కోసం పనిచేయాలని సూచించారు. సోమవారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పశ్చిమబెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ‘‘ఈరోజు భారత ప్రజాస్వామ్యంపై, అభివృద్ధి కోసం పనిచేసే రాజకీయాలపై, ఏక్‌భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ స్ఫూర్తిపై విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన రోజు. గంగామాత ప్రవహిస్తున్న ప్రతిచోటా బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’’ అని మోదీ అన్నారు. బెంగాల్‌లో భయం కాకుండా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ‘‘బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘనవిజయం సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వారిని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారి కలల్ని, ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధ్యమైనంత మేర కృషి చేస్తాం’’ అని మోదీ అన్నారు. ఇకపై ప్రజలు ప్రతీకారం కాకుండా మార్పు గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదనే విషయాన్ని ఐదు రాష్ట్రాల ప్రజలు ప్రపంచానికి చాటిచెప్పారని వ్యాఖ్యానించారు. ఈరోజు గెలిచింది భారత ప్రజాస్వామ్యం మాత్రమే కాదని, భారత రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య విధానం గెలిచాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పాల్గొన్న తీరు అత్యున్నతమైనది, చరిత్రాత్మకమైనదని అన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించారంటూ ఎన్నికల కమిషన్‌ను, సిబ్బందిని ప్రధాని అభినందించారు. ప్రజాస్వామ్యం గౌరవాన్ని నిలబెట్టడంలో వారి పాత్రను చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ప్రశంసించారు.


ఇక 2026 బెంగాల్‌ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ‘ఎక్స్‌’లో మోదీ పేర్కొన్నారు. ఇది బీజేపీ కార్యకర్తల విజయమని, వారి కృషి, కష్టం లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు. తమ అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళుతూ ఏళ్లుగా వారు పనిచేసిన తీరుకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. తమిళనాడు, కేరళలో విజయం సాధించిన పార్టీలకు మోదీ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. తమిళనాడులో ఎన్డీయేకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ కూటమి ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.

Updated Date - May 05 , 2026 | 06:01 AM