అనంతలో జల సంరక్షణ భేష్!
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:44 AM
ప్రజల భాగస్వామ్యంతోనే జలవనరుల పునరుద్ధరణ సాధ్యమని ప్రధాని మోదీ తెలిపారు.
కరువు జిల్లాలో ప్రజలు, యంత్రాంగం సంయుక్త కృషితో నీటి వనరుల అభివృద్ధి
7 వేలకు పైగా మొక్కలు కూడా నాటారు
‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతోనే జలవనరుల పునరుద్ధరణ సాధ్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ప్రజలు, అధికారులు కలిసి చేపట్టిన జలసంరక్షణ చర్యలను ఆదివారం తన ‘మన్‌కీ బాత్’ ప్రసంగం సందర్భంగా ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో జరిగిన నీటి సంరక్షణ పనులను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తీవ్ర కరువుతో, ఎర్ర నేలలతో ఎడారిని తలపించే అనంతపురంలో నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా ఉండేది. అక్కడ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడవు. అందుకే.. అక్కడి ప్రజలు అనంతపురాన్ని ఎడారితో పోలుస్తారు. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో స్థానిక ప్రజలు, యంత్రాంగం కలిసి నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం అవి నీటితో కళకళలాడుతున్నాయి. దీనితోపాటు 7 వేలకు పైగా మొక్కలు నాటారు. తద్వారా అనంతపురంలో నీటి సంరక్షణతోపాటు పచ్చదనం కూడా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి మొత్తం పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించబడింది. అక్కడి ప్రజలు, పాలకులు చేసిన ఈ సామూహిక కృషి ఎంతో గర్వకారణం’’ అని మోదీ కొనియాడారు. అలాగే యూపీలోని ఆజంగఢ్ ప్రజలు తమ ప్రాంతంలో ప్రవహించే తంసా నదిని పునరుద్ధరించిన తీరును అభినందించారు. కాలుష్యం, పూడిక, చెత్తాచెదారంతో నిండిన ఆ నదిని ఓ ఉద్యమంలా శుభ్రం చేశారన్నారు. దేశ ప్రజల్లో ఉన్న సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించుకునే తత్వం అద్భుతమని పేర్కొన్నారు.