ఆలస్యం.. అన్యాయమే!
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:53 AM
రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలు, పలు అసెంబ్లీ ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
2029లో మహిళా రిజర్వేషన్ల అమలుతో దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతం
ఏమాత్రం ఆలస్యం జరిగినా.. అది దేశ మహిళలకు తీవ్ర అన్యాయం చేసినట్లే..
వారి హక్కుల కోసం ఇక వేచి చూడొద్దు
దేశ మహిళలకు మోదీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ/డెహ్రాడూన్, ఏప్రిల్ 14: రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలు, పలు అసెంబ్లీ ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా మన దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతమై, చైతన్యవంతం అవుతుందని పేర్కొన్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ‘నారీశక్తి వందన్ అధినియం’ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం దేశంలోని మహిళలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం జరిగినా.. అది మన దేశ మహిళలకు అన్యాయం చేసినట్టే అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లో వారి గొంతుకను మరింత బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాల్లో మరింత క్రియాశీల భాగస్వాములవుతారని, అప్పుడే ‘వికసిత్ భారత్’ దిశగా సాగే ప్రయాణం బలపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నారని, ఈ నేపథ్యంలో చట్టసభల్లో కూడా వారి ప్రాతినిధ్యం, భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నారీశక్తి వందన్ అధినియం’ సవరణలను ఆమోదించాలని, రిజర్వేషన్ల విషయంలో ఇంకా ఆలస్యం తగదన్నారు. భారతీయ కుమార్తెలు తమకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటి కోసం అనంతకాలం వేచి ఉండాలని కోరలేమని ప్రధాని మోదీ అన్నారు. ‘మన చట్టసభల్లో మహిళల గొంతుక బలంగా మారినప్పుడే.. దేశ ప్రజాస్వామ్యం మరింత ధ్రుడంగా అవుతుంది’ అని పేర్కొన్నారు. రాబోవు పార్లమెంట్ సమావేశాలకు, రాజ్యాంగ సవరణ ఆమోదం కోసం దేశ నలుమూలలా ఉన్న కోట్లాది మంది మహిళలు ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా ఈ చారిత్రక పార్లమెంట్ సమావేశాల్లో పాలుపంచుకొనేలా ప్రోత్సహిస్తూ అందరూ తమ స్థానిక ఎంపీలకు లేఖలు రాయాలని అభ్యర్థించారు. వారు చేయబోయే పని ప్రభావం శతాబ్దాల పాటు నిలిచిపోతుందని గుర్తు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ఆమోదించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళల్లో ఉత్సాహాన్ని గమనించానన్నారు.
ఏకాభిప్రాయం ఉన్నా..
మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రస్తుతమే కాకుండా అనేక దశాబ్దాలుగా ఏకాభిప్రాయం ఉందని మోదీ పేర్కొన్నారు. గత 3-4 దశాబ్దాలుగా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే అవి పూర్తిగా ఫలించలేదన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా దగ్గరగా వచ్చి కూడా దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. ‘దురదృష్టవశాత్తూ ఎల్లప్పుడూ ఏకాభిప్రాయం ఉన్న విషయం.. ఎన్నడూ ఒక తార్కిక ముగింపునకు రాలేకపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో సగం మంది ఉన్న నారీశక్తి ఆకాంక్షలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ఉత్తరాఖండ్ అభివృద్ధికి అన్ని విధాలుగా మంచి ఊపునిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా జరగనుందని, ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా, పరిశుభ్రంగా జరుపుకునేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 213 కిలోమీటర్ల ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్.. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గిస్తుంది. ప్రధాన పర్యాటక, ఆర్థిక కేంద్రాలకు మెరుగైన కనెక్టివిటీతో పాటు కొత్త వాణిజ్య అవకాశాల సృష్టి ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి బలోపేతంలో కీలక పాత్ర పోషించనుంది.
అది దేశ ప్రజల సామూహిక ఆకాంక్ష..
2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనేది దేశ ప్రజల సామూహిక ఆకాంక్ష అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందిందని, ఇక ఆలస్యం లేకుండా 2029 ఎన్నికల్లో దాన్ని అమలు చేసేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మద్దతివ్వాలని ఆయన కోరారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్‌ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘నారీశక్తి వందన్ అధినియం సవరణ బిల్లుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నేను ఈ రోజున, దేవభూమి (ఉత్తరాఖండ్) నుంచి మరోసారి అభ్యర్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 2029 నాటికి మన దేశ జనాభాలో సగమైన మహిళలకు వారి న్యాయమైన హక్కులు అందేలా చూస్తామన్నారు. తన ప్రసంగం ప్రారంభానికి ముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి తరఫున నివాళులర్పించారు. పేదలు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వారికి న్యాయమైన వ్యవస్థను అందించేందుకు అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.