Share News

యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు: మోదీ

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:31 AM

యుద్ధాలు, సైనిక సంఘర్షణల ద్వారా ఎలాంటి సమస్యలూ పరిష్కారం కావని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియాల్లో..

యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు: మోదీ

  • భారత్‌- ఆస్ట్రియా మధ్య 6కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: యుద్ధాలు, సైనిక సంఘర్షణల ద్వారా ఎలాంటి సమస్యలూ పరిష్కారం కావని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియాల్లో సంక్షోభాల వల్ల ప్రపంచ దేశాలన్నీ గంభీర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన ఆస్ట్రియా ఫెడరల్‌ చాన్సలర్‌ క్రిస్టియన్‌ స్టాకర్‌తో గురువారం మోదీ విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ఆస్ట్రియా చాన్సలర్‌ భారత్‌లో పర్యటించడం 4 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని, ఉగ్రవాద నిర్మూలనకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగా భారత్‌, ఆస్ట్రియా మధ్య రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో 6కీలక ఒప్పందాలు కుదిరాయి. పరస్పర పెట్టుబడులను ప్రొత్సహించేందుకు ‘ఫాస్ట్‌ట్రాక్‌ మెకానిజం’ ఏర్పాటుతో పాటు సైనిక వ్యవహారాల్లో సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆస్ట్రియాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని, భారత్‌కు ఉన్న వేగం, ఉత్పత్తి సామర్థ్యంతో జోడించడం ద్వారా ప్రపంచానికి అవసరమైన వస్తువులను నాణ్యంగా సరఫరా చేయవచ్చని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైల్వేలు, క్లీన్‌ ఎనర్జీ వంటి ప్రాజెక్టులలో ఆస్ట్రియా కంపెనీల భాగస్వామ్యం భారత ఆర్థికవ్యవస్థకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆస్ట్రియా చాన్సలర్‌ స్టాకర్‌ మాట్లాడుతూ.. భౌగోళిక రాజకీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ వంటి దేశాలతో నమ్మకమైన భాగస్వామ్యాలు విలువైనవని కొనియాడారు.

Updated Date - Apr 17 , 2026 | 03:31 AM